Begin typing your search above and press return to search.

ఇన్ఫోసిస్ మూర్తి కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువే చెబుతున్న మస్క్!

అధిక పనిగంటల కారణంగా ఉద్యోగుల్లో ఈ తరహా ఆలోచనలు వస్తున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   24 Oct 2024 1:30 AM GMT
ఇన్ఫోసిస్  మూర్తి కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువే చెబుతున్న మస్క్!
X

ఇటీవల కాలంలో పని ఒత్తిడి, దాని ఫలితంగా డిప్రెషన్ లోకి వెళ్లడం, ఆత్మహత్యకు పాల్పడటం వంటి వార్తలు ఇటీవల తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక పనిగంటల కారణంగా ఉద్యోగుల్లో ఈ తరహా ఆలోచనలు వస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో... వారానికి ఐదు రోజులు, రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పని ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ చర్చ మొదలైంది.

ప్రధానంగా కార్పొరేట్ ప్రపంచంలో తక్కువలో తక్కువగా సుమారు 12 నుంచి 14 గంటలు పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని.. వీకెండ్స్ లో కూడా ఇంటి నుంచి పనిచేయాల్సిన ఒత్తిడి ఉంటుందని అంటున్నారు. ఇటీవల బెంగళూరులో ఓ వ్యక్తి వర్చువల్ క్లయింట్ మీటింగ్ కి హాజరవుతూనే దుర్గాపూజ కార్యక్రమంలో పాల్గొన్న వీడియో సంచలనంగా మారింది.

ఇక ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగి, 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మృతి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పని ఒత్తిడి వల్లే ఆమె చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమిళనాడులోని థాజంబూర్ లో పని ఒత్తిడి కారణంగానే తీవ్ర డిప్రెషన్ కి గురైన 38 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కార్తికేయ ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే.. అతడి భార్య బయటకు వెళ్లి వచ్చే సరికి కరెంటు వైర్లు శరీరానికి చుట్టుకుని అపస్మారకంగా పడి ఉన్నాడని చెబుతున్నారు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వయసు వరుసగా 10 ఏళ్లు, 8 ఏళ్లు! బాధితుడు రెండు నెలల క్రితం డిప్రెషన్ తో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడు తీవ్రమైన పని ఒత్తిడికి గురైనట్లు చెప్పారు!

మరోపక్క దేశం అభివృద్ధి చెందాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ సీఈవో నారాయణ మూర్తి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. "ఇది నాదేశం.. నా దేశం కోసం వారానికి 70 గంటలు పని చేసేందుకు నేను సిద్ధం అంటూ ముందుకు రావాలి అని నారాయణ మూర్తి పిలుపునిచ్చారు. దీంతో... ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారగా... నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇలా పని గంటలు.. ఫలితంగా వచ్చే పని ఒత్తిడి మొదలైన విషయాలపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో... వారానికి 100 గంటలు పనిచేసే ఇతరులు 50 గంటలు పనిచేసిన దానికంటే రెట్టింపు ఫలితం సాధిస్తారని.. గతంలో తాను, తన సోదరుడూ రాత్రుళ్లు కోడింగ్ చేసేవాళ్లమని చెబుతున్నారు ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.

ఇదే సమయంలో... ప్రస్తుతం తాను వారానికి 120 గంటలు పని చేస్తున్నట్ళు వెల్లడించారు మస్క్. అంటే... సగటున రోజుకు 17 గంటలు పైనే ఆయన పనిచేస్తున్నాడన్నమాట.

ఈ సందర్భంగా మస్క్ అభిప్రాయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా... కొంతమంది మస్క్ అంకితభావాన్ని మెచ్చుకుంటుండగా.. మరికొంతమంది మాత్రం వృత్తిపరమైన లక్ష్యాలతోపాటు వ్యక్తిగత శ్రేయస్సుకు కూడా ప్రాధాన్యమిస్తూ సమతుల్యత పాటించాలని వాదిస్తున్నారు.