'హాఫ్ స్టార్'షిప్.. ట్రంప్ సాక్షిగా ఒకటి సక్సెస్.. మరోటి విఫలం
ఇలా సాగుతున్నాయి అపర కుబేరుడు, స్పేస్ ఎక్స్ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఆలోచనలు.
By: Tupaki Desk | 20 Nov 2024 4:30 PM GMTటెక్నాలజీ హద్దే లేకుండా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఇండియా నుంచి అమెరికాకు రావడానికి రెండు రోజులు ప్రయాణించాలా? ఢిల్లీ నుంచి న్యూయార్క్ కు నలభై నిమిషాల్లో వచ్చేలా చేస్తే..? అసలు.. ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా మరో మూలకు గంటలో తీసుకెళ్తే..? ఇలా సాగుతున్నాయి అపర కుబేరుడు, స్పేస్ ఎక్స్ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఆలోచనలు. ఈ దిశగానే ప్రయోగాలు కూడా చేపడుతున్నారు.
స్టార్ (వార్) షిప్
మనకు స్టార్ వార్స్ సినిమాల గురించే తెలుసు. కానీ, స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్ షిప్ గురించి కూడా తెలుసుకోవాలి. వీటితో ఈ ప్రపంచాన్నే కాదు అంతరిక్షాన్నీ ఏలేద్దాం అనేది మస్క్ ప్లాన్. ఈ క్రమంలోనే ఆయన చేపట్టే ప్రయోగాలు సంచలనంగా మారుతుంటాయి. ఎదురుదెబ్బలు తగిలినా వెనక్కుతగ్గకపోవడం మస్క్ నైజం. ఇటీవల స్టార్ షిప్ ను విజయవంతంగా ఎక్కడ ప్రయోగించారో అక్కడే ల్యాండ్ అయ్యేలా చేయడంలో మస్క్ సక్సెస్ అయ్యారు. తాజాగా మరో అడ్వాన్సుడ్ ప్రయోగం చేపట్టారు. దీనికి అమెరికాలోని టెక్సాస్ వేదిక. అమెరికా ఎన్నికైన అధ్యక్షుడు ట్రంప్ ను ఆహ్వానించారు. కాగా, స్టార్ షిప్ ను ప్రయోగించాక అది తిరిగి వస్తుందేమోనని ఎదురుచూసినా రాలేదు. సాంకేతిక కారణాలతో అది సముద్రంలో దిగింది.
మస్క్, ట్రంప్ బంధం బలపడుతోంది
ఈ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మస్క్.. ట్రంప్ నకు మద్దతు ఇవ్వడమే కాక.. రూ.500 కోట్లను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ గెలుపొందడం, ఆయన సంస్థ టెస్లా షేర్లు అమాంతం పెరగడం వేరే కథ. ఇక మస్క్-ట్రంప్ సంబంధాలు ఇలా బలపడిన క్రమంలో స్పేస్ ఎక్స్ భారీ స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగానికి ట్రంప్ ను ఆహ్వానించారు మస్క్. వీరిద్దరూ దీనిని ప్రత్యక్షంగా వీక్షించారు. స్టార్ షిప్ ప్రయోగంలో ఒక దశ విఫలమవగా.. రెండో దశ విజయవంతమైంది.
టెక్సాస్ లో 400 అడుగుల ఎత్తైన భారీ రాకెట్ ను అమెరికా కాలమానం ప్రకారం స్పేస్ ఎక్స్ మంగళవారం ప్రయోగించింది. చంద్రుడిపై వ్యోమగాములు, అంగారకుడి పైకి ఫెర్రీ క్రూను చేర్చేలా ఈ రాకెట్ ను రూపొందించారు. నిర్దేశించిన మేర ఈ రాకెట్ లోని బూస్టర్ తిరిగి భూమ్మీదకు వస్తే.. లాంచ్ ప్యాడ్ వద్ద ఉండే మర చేతులు (మెకానికల్ ఆర్మ్స్) పట్టుకుంటాయి. గత నెలలో స్పేస్ ఎక్స్ సంస్థ భారీ స్టార్ షిప్ రాకెట్ బూస్టర్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఆ స్టార్ షిప్ నింగిలోకి దూసుకెళ్లడంతో పాటు లాంచ్ ప్యాడ్ సురక్షితంగా చేరుకుంది. దీన్ని ఇంజినీరింగ్ అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా కొనియాడారు.
తాజా ప్రయోగంలో మాత్రం ఈ దశ విఫలమైంది. సాంకేతిక సమస్యతో ప్రయోగించిన నాలుగు నిమిషాలకే ‘బూస్టర్ క్యాచ్’ ప్రక్రియను ఆపివేశారు. మరో మూడు నిమిషాల తర్వాత అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో కుప్పకూలింది. అదే సమయంలో పరీక్ష కోసం ఉపయోగించిన ఖాళీ స్టార్‌షిప్ వాహకనౌక దాదాపు 90 నిమిషాల పాటు భూమి చుట్టూ తిరిగి సురక్షితంగా హిందూ మహా సముద్రంలో దిగింది.
స్టార్ షిప్ పేరుతో అంగారకుడి పైకి మనుషులను పంపించాలనేది తన ప్లాన్ గా మస్క్ చెబుతున్నారు. అసలు ఆయన ప్లాన్ ప్రపంచ విమానయాన రంగాన్ని అధీనంలోకి తీసుకోవడం. స్టార్ షిప్ లతో గంటలో ప్రపంచంలోని ఆ మూల నుంచి ఈ మూలకు మనుషుల్ని చేర్చే ప్రయోగాలకు మస్క్ ప్రస్తుతం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట. దీనికి అనుమతుల కోసమే ఆయన ట్రంప్ కు రూ.వందల కోట్ల సాయం చేసి.. ప్రచారంలోనూ పాల్గొన్నారు.