మస్క్, వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు.. ట్రంప్ 2.0 లో ఎవరెవరంటే..?
ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు స్టార్ట్ చేశారని అంటున్నారు.
By: Tupaki Desk | 13 Nov 2024 6:08 AM GMTఅత్యంత ఆసక్తికరంగా, ఎంతో రసవత్తరంగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్ద్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 50.2 శాతం ఓట్లతో 312 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ సూపర్ విక్టరీ సాధించారు. త్వరలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు స్టార్ట్ చేశారని అంటున్నారు. ఇందులో భాగంగా... ఎఫిషియెన్సీ బాధ్యతలతో పాటు విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు, అమెరికా రక్షణ మంత్రి మొదలైన కీలక శాఖలు, బాధ్యతలపై కసరత్తులు చేస్తున్నరని అంటున్నారు.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలను ముమ్మరం చేశారని అంటున్నారు. ఈ క్రమంలో కీలక పదవుల భర్తీపై కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో... తన గెలుపులో కీలక పాత్ర పోషించిన స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు.
ఇందులో భాగంగా.. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు ఎఫ్షియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా... ఈ అద్భుతమైన ఇద్దరూ ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన, అనవసర ఖర్చుల తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహిస్తారని.. వీరిద్దరూ తన పాలనకు మార్గం సుగమం చేస్తారని ట్రంప్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదే సమయంలో... విదేశాంగ శాఖ మంత్రిగా ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోను నియమించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ పదవి కోసం రామస్వామి పేరు ప్రముఖంగా వినిపించింది. అదే విధంగా... జాతీయ భద్రతా సలహాదారుగా కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్ ను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.
ఇక రక్షణ మంత్రి నియామకంపైనా ట్రంప్ కీలక కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ పదవిలో వరుసగా ఐదుగురిని నియమించారు ట్రంప్. అయితే... వీరిలో ఏ ఒక్కరూ ట్రంప్ ను మెప్పించలేకపోయారని అంటారు. దీంతో... ఈ పదవి కోసం ట్రంప్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.