Begin typing your search above and press return to search.

ట్రంప్-పుతిన్ మధ్యలో మస్క్.. సమ్ థింగ్ సమ్ థింగ్

రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకు మద్దతుగా అప్పట్లో రష్యా పావులు కదిపిందనే వాదన వినిపించింది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 1:30 PM GMT
ట్రంప్-పుతిన్ మధ్యలో మస్క్.. సమ్ థింగ్ సమ్ థింగ్
X

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏదో జరిగిందనే అనుమానాలున్నాయి.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకు మద్దతుగా అప్పట్లో రష్యా పావులు కదిపిందనే వాదన వినిపించింది. ట్రంప్ వైపు ప్రజాభిప్రాయం మళ్లేలా పుతిన్ వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అయితే, ఇదేమీ నిర్ధారణ కాలేదు. మళ్లీ అమెరికా ఎన్నికలు వచ్చేశాయి.. మూడోసారి వరుసగా ట్రంప్ పోటీ చేస్తున్నారు. మధ్యలో ఒకసారి ఓడిపోయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పటి ఎన్నికల్లో అత్యంత కీలకంగా నిలుస్తున్నారు అపర కుబేరుడు ఎలాన్ మస్క్.

మస్క్ మద్దతంటే మజాకానా?

మస్క్ అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకు మద్దతు పలికారు. కొన్ని రోజుల కిందట ట్రంప్ బహిరంగ సభలో మస్క్ కూడా పాల్గొన్నారు. ట్రంప్ విజయాన్ని కోరుతూ నినాదాలు రాసి ఉన్న దుస్తులను ధరించారు. మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా ట్విటర్ ను కొనుగోలు చేసి దానికి ఎక్స్ గా పేరు మార్చిన మస్క్.. ట్రంప్ నకు మద్దతు ఇవ్వడం నైతికంగా ఆయనకు విజయమే. ఇక పైన చెప్పుకొన్నట్లు ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కు చాలా దగ్గర. పుతిన్ ను గొప్పగా పొగిడిన చరిత్ర ట్రంప్ ది. అంతేగాక.. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే జరిగేది కాదని ప్రకటించారు. ట్రంప్ అత్యంత రహస్యంగా పుతిన్‌ కు ఫోన్‌ చేస్తారని జర్నలిస్ట్‌ బాబ్‌ ఉడ్‌ వర్డ్‌ ఓ పుస్తకంలో రాశారు. కాగా,

2021లో ట్రంప్‌ ఓడిపాయకనే.. వీరిద్దరూ ఏడుసార్లు అత్యంత రహస్యంగా మాట్లాడుకున్నట్లు తెలిపారు. కానీ, ట్రంప్ మాత్రం వీటిని కొట్టి పారేస్తుంటారు.

మధ్యలో మస్క్ ఎంట్రీ..

ఉక్రెయిన్ పై యుద్ధం సాగిస్తున్న పుతిన్ ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు శత్రువు. అమెరికా, యూరప్ లోని కీలక దేశాలన్నీ రష్యాను వెలివేశాయి. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్ నకు మద్దతు పలుకుతున్న మస్క్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో టచ్‌ లో ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా ఉక్రెయిన్ పై యుద్ధం మొదలైన 2022 చివరి నుంచి మస్క్ ఈ సంబంధాలు కొనసాగిస్తున్నారని వాల్‌ స్ట్రీట్ జర్నల్ పత్రిక కథనం ప్రచురించింది.

ఏం మాట్లాడుకున్నారో?

పుతిన్-మస్క్ మధ్య.. పలు వ్యక్తిగత అంశాలతో పాటు అంతర్జాతీయ పరిస్థితులు చర్చకు వచ్చాయట. చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ ను సమర్థిస్తూ పుతిన్‌ మాట్లాడినట్లు సమాచారం. వివాదాస్పద అంశంగా మారిన నేపథ్యంలో తైవాన్‌ మీదుగా స్టార్‌ లింక్‌ శాటిలైట్లను యాక్టివేట్ చేయొద్దని పుతిన్ కోరినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. కాగా, 2022లో ఉక్రియన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన సమయంలో స్టార్‌ లింక్‌ టర్మినల్స్‌ ను మస్క్ రష్యాకు విక్రయించారన్న విమర్శలు వచ్చాయి. వీటిని మస్క్ కొట్టి పారేశారు. మస్క్ కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సహా పలు సంస్థలు అమెరికా మిలటరీ, ప్రభుత్వ ఏజెన్సీలతో విస్తృత వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నందున.. ఇప్పుడు పుతిన్ తో ఆయన సంబంధాలు అమెరికా భద్రతాపరమైన సమస్యలకు దారితీయొచ్చని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.