Begin typing your search above and press return to search.

మస్క్‌ మామూలోడా.. మెదడులో చిప్‌ పెట్టి చెస్‌ ఆడించాడు!

ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ ఎక్స్, టెస్లా, న్యూరాలింక్‌ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ మరో సంచలనం సృష్టించారు

By:  Tupaki Desk   |   21 March 2024 5:17 AM GMT
మస్క్‌ మామూలోడా.. మెదడులో చిప్‌ పెట్టి చెస్‌ ఆడించాడు!
X

ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ ఎక్స్, టెస్లా, న్యూరాలింక్‌ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ మరో సంచలనం సృష్టించారు. పక్షవాతానికి గురైన ఓ వ్యక్తికి మెదడులో చిప్‌ అమర్చారు. ఆ మైండ్‌ కంట్రోల్‌ చిప్‌ సాయంతో ఎలాన్‌ మస్క్‌ తో ఆ వ్యక్తి చెస్‌ ఆడాడు.

ఈ మేరకు ఎలాన్‌ మస్క్‌ కు చెందిన న్యూరాలింక్‌ కార్పొరేషన్‌ అరుదైన రికార్డును సృష్టించింది. పక్షవాతానికి గురయిన ఓ వ్యక్తి బ్రెయిన్‌ లో చిప్‌ అమర్చి.. ఆ మైండ్‌ కంట్రోల్‌ చిప్‌ సాయంతో ఆన్‌లైన్‌ లో చెస్‌ ఆడిస్తూ అదంతా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసింది.

కాళ్లు చేతులు పక్షవాతానికి (క్వాడ్రిప్లెజియా)గురైన నోలన్‌ అర్బాగ్‌ (29) అనే వ్యక్తిలో తొలి న్యూరాలింక్‌ చిప్‌ ను అమర్చారు. కాగా ఈ ప్రాజెక్టులో భాగం కావడం తన అదృష్టమని రోగి నోలన్‌ అర్బాగ్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

ఈ నేపథ్యంలో ఎలాన్‌ మస్క్‌ మాట్లాడుతూ ప్రపంచంలోని మొట్టమొదటి న్యూరాలింక్‌ చిప్‌ అమర్చబడిన వ్యక్తి.. కంప్యూటర్‌ ను నియంత్రించగలడని, తన ఆలోచనల ద్వారా ద్వారా వీడియో గేమ్స్‌ ఆడగలడని ఎలన్‌ మస్క్‌ తెలిపారు. ఇక నుంచి పక్షవాతం, ప్రమాదాలతో శరీర భాగాలు పని చేయకుండా మంచానికే పరిమితం అయిన వాళ్లకు న్యూరాలింక్‌ చిప్‌ తో ఎంతో మేలు కలుగుతుందని మస్క్‌ వెల్లడించారు. తద్వారా చారిత్రాత్మక మైలురాయికి చేరుకున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకాలం అసాధ్యం అనుకున్నదానిని సుసాధ్యం చేశామన్నారు.

కాగా 2016లో బ్రెయిన్‌ టెక్నాలజీ స్టార్టప్‌.. ‘న్యూరాలింక్‌’ ను ఎలన్‌ మస్క్‌ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బ్రెయిన్‌ దెబ్బతిన్న వ్యక్తులు, ఇతర మెదడు వైకల్యాలున్న వ్యక్తులను సాధారణ స్థితికి చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ క్రమంలో న్యూరాలింక్‌ తయారు చేసిన బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ ఫేస్‌ టెక్నాలజీ చిప్‌ ను రోగి మెదడులో అమర్చే ప్రయోగాలు చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించింది. ఈ క్రమంలో జనవరి చివరివారంలో ఓ వ్యక్తి బ్రెయిన్‌ లో చిప్‌ అమర్చామని.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు ఎలన్‌ మస్క్‌ ప్రకటించారు.

కాగా ఈ చిప్‌ ఎలా పనిచేస్తుందంటే.. న్యూరాలింక్‌ బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్‌ 1 అనే చిప్‌ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకలతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమేనంటున్నారు.

చిప్‌ ను అమర్చే క్రమంలో పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్‌ 1 సాధనాన్ని పెడతారు. ఈ చిప్‌ నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌ లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు సమీపంలో ప్రవేశపెడతారు.

ఈ క్రమంలో ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌ నకు పంపుతాయి. ఒక చిప్‌ లో ఉండే ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి.

కాగా మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌ లను ప్రవేశపెట్టొచ్చు. ఇంస్టాల్‌ అయ్యాక మెదడు నుంచి విద్యుత్‌ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమలుగానూ మార్చుతుంది.