Begin typing your search above and press return to search.

హిజాబ్ ధరించాలన్నందుకు ఆమె ఏం చేసిందో తెలిస్తే షాక్

'హిజాబ్' విషయంలో ముస్లిం దేశాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Jan 2025 9:30 AM GMT
హిజాబ్ ధరించాలన్నందుకు ఆమె ఏం చేసిందో తెలిస్తే షాక్
X

‘హిజాబ్’ విషయంలో ముస్లిం దేశాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. మహిళల హక్కుల గురించి మాట్లాడేవారు.. సమానత్వం గురించి లెక్చర్లు ఇచ్చేవారు.. హిజాబ్ విషయంలో మహిళలకు స్వేచ్ఛ లేకుండా చేస్తునన వైనంపై గళం విప్పేందుకు ప్రయత్నించరు. అంతేకాదు.. హిజాబ్ ధరించని మహిళల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ.. కఠిన శిక్షలకు తెగపబడటం కనిపిస్తుంది. ఇప్పటికే హిజాబ్ కు వ్యతిరేకంగా కొన్ని దేశాల్లో జరుగుతున్న పోరాటాలకు ఆశించినంత మద్దతు లభించని దుస్థితి.

హిజాబ్ విషయంలో ముస్లిం దేశాల ప్రభుత్వాలు సైతం మహిళలకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. హిజాబ్ ను వ్యతిరేకించే మహిళలపై చర్యలకు మోరల్ పోలీసింగ్ చేపట్టటం.. దీనిపై ఇరాన్ మహిళలు గళం విప్పి పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన పరిస్థితి. ఇలాంటి చైతన్య గొంతుల్ని అదిమేసేందుకు ప్రభుత్వాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాయో.. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఇరాన్ లో చోటు చేసుకుంది.

పబ్లిక్ ప్లేస్ లో ఒక మహిళను హిజాబ్ ధరించాలని ఒక మతపెద్ద ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు మహిళ.. సదరు మతపెద్ద వెంట పడటమే కాదు..ఆయన తలపై ఉన్న పాగాను లాగేసి.. హిజాబ్ తరహాలో తలకు చుట్టుకొంది. ఈ సందర్భంగా తన ఆగ్రహాన్ని దాచుకోకుండా ఆమె ఓపెన్ గా వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఇప్పుడు మీ గౌరవం ఏమైంది? నా భర్తను మీరేం చేశారు? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కనిపించారు. ఈ ఉదంతం ఇరాన్ రాజధాని మెహ్రాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది.

ఈ ఉదంతాన్ని ఒక మహిళా జర్నలిస్టు వీడియో తీసి పోస్టు చేశారు. మత పెద్దలు తాము ధరించే తలపాగాలు పవిత్రమైనవిగా.. అవే తమ గౌరవానికి చిహ్నంగా..వాటిని ఎవరూ తాక కూడదన్నట్లుగా వ్యవహరిస్తారు.కానీ.. సదరు మహిళ తన నిరసనతో ఆ మతపెద్దకు దిమ్మ తిరిగే షాకిచ్చిందని చెప్పాలి.లింగ వివక్షపై పోరాటంలో అలిసిపోయిన ఇరాన్ మహిళలు.. ఇప్పుడు కోపంతో ఎంతకైనా తెగించేందుకు సిద్దమన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.

ఈ ఉదంతంపై ఇరాన్ కు చెందిన ఒక మీడియా సంస్థ మాత్రం.. ఆందోళన చేసిన మహిళకు మతిస్థిమితం సరిగా లేదని పేర్కొంది. ఆమెను అదుపులోకి తీసుకున్న సిబ్బంది తర్వాత వదిలేసినట్లుగా పేర్కొన్నారు. అయితే.. సదరు మహిళకు నెటిజన్లు మాత్రం ఆమె పక్షాన నిలిచారు. హక్కుల కోసం పోరాటే అనేక మంది మహిళలకు ఆమె ప్రతినిధిలా కనిపించినట్లుగా చెబుతున్నారు. గడిచిన కొంతకాలంగా ఇరాన్ లో హిజాబ్ సంస్క్రతికి వ్యతిరేకంగా పలువురు మహిళలు గళం విప్పుతున్నారు. నిరసనలు చేపడుతున్నారు. అయితే.. ప్రభుత్వాలు మాత్రం ఈ నిరసనల్ని కఠినంగా అణిచి వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడికిపోయింది. చివరకు హిజాబ్ ను రద్దుచేసినప్పటికి.. ఏడాది క్రితం మళ్లీత అమల్లోకి వచ్చింది. దీనిపై మహిళలు ఎంత పెద్దగా నిరసనలు చేపట్టినా.. అక్కడి ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించని దుస్థితి.