లంచం అడిగితే.. ఇక అంతే.. ఈయన స్టయిలే వేరు!
ఆయనే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, గుర్రంగూడ ప్రాంతానికి చెందిన ముత్యం రెడ్డి. ఈయనకు లంచాలు అంటే మహా కోపం.
By: Tupaki Desk | 15 Aug 2024 4:17 AM GMTప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా.. ఎంత ప్రయత్నం చేసినా.. కొందరు అధికారుల తీరుల్లో మాత్రం ఇప్పటికీ మార్పులు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు తీరు ఎలా ఉన్నా.. రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న అధికారులు మాత్రం 'లంచం' లేకపోతే.. కొందరు పనిచేయని పరిస్థితి నెలకొంది. దీనిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం ప్రయత్ని స్తూనే ఉన్నాయి. కానీ, పై డబ్బులకు అలవాటు పడిన అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఈ క్రమంలో గత రెండేళ్ల నుంచి అధికారులపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒకప్పుడు అవినీతి నిరోధక శాఖ అధికారులు అంటే.. పనిలేని శాఖలో ఉన్నారంటూ గేలి చేసే పరిస్థితి ఉండేది.
కానీ, ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా అవినీతి నిరోధక శాఖ అధికారులకు మాత్రం చేతి నిండా పనే. రోజూ వచ్చే ఫిర్యాదుల సంఖ్య కూడా పెరుగుతుండడం.. గమనార్హం. అంతేకాదు.. అవినీతి చేస్తున్న అధికారులు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నారు. వీరిని ఆధారాలతో సహా పట్టుకోవడం, నేరాలను నిరూపించడం కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులకు సవాలుగా మారింది. పైగా సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత.. లంచాలు ఇచ్చేవారు.. అధికారులను, సిబ్బందిని పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడు ఆసక్తిగా ఒక వ్యక్తి పేరు మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఆయనే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, గుర్రంగూడ ప్రాంతానికి చెందిన ముత్యం రెడ్డి. ఈయనకు లంచాలు అంటే మహా కోపం. ప్రజలు కట్టిన పన్నులతో వేతనాలు తీసుకుంటే.. ప్రజల కోసం పనిచేయకుండా.. లంచాలు తీసుకుంటున్నారని తెలిస్తే.. ఈయన కు పట్టలేని ఆగ్రహం వచ్చేస్తుంది. లంచాలకు వ్యతిరేకంగా ఆయన తన వ్యక్తిగత పోరాటాన్ని ఆయన ఎప్పుడూ చేస్తూనే ఉన్నా రు. తన వ్యక్తిగత పనులపై అధికారుల వద్దకు వెళ్లినప్పుడు.. ఎవరైనా ముత్యం రెడ్డిని లంచం అడిగారంటే ఇక, వారి పని అయిపోయినట్టే. పక్కా ఆధారాలతో ఆయన సదరు అధికారులను ఏసీబీకి పట్టించేస్తారు.
ఇలా.. గత మూడున్నర సంవత్సరాల్లో ముత్యంరెడ్డి ఏడుగురు అధికారులను ఏసీబీతో అరెస్టు చేయించారు. 2019లో వీఆర్ వో శంకర్‌ను, 2021లో గ్రామ సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ సహా నలుగురిని అరెస్టు చేయించారు. ఈ సంవత్సరం ఏకంగా మీర్ పేట పోలీసు స్టేషన్ ఎస్ ఐ సైదులును కూడా లంచం డిమాండ్ చేశారంటూ అరెస్టు చేయించారు. అంతేకాదు.. తాజాగా తెరమీదికి వచ్చిన రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్, రెవెన్యూ ఆఫీసర్‌ను రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసిన వ్యవహారంపై ఏసీబీకి పట్టించారు. మొత్తానికి ఇప్పుడు ముత్యం రెడ్డి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతోంది.