రికార్డు: రూ.50లక్షల కోట్లకు మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు
తాజాగా ఈ ఆస్తుల విలువ ఏకంగా రూ.50లక్షల కోట్ల మార్క్ ను దాటేశాయి. గత ఏడాది మొత్తమ్మీదా ఫండ్స్ నిర్వాహణ ఆస్తులు 27 శాతం వ్రద్ధి చెందాయి.
By: Tupaki Desk | 9 Jan 2024 4:56 AM GMTదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా దూసుకెళుతుందన్న దానికి నిదర్శనంగా మారింది తాజాగా వెలువడుతున్న గణాంకాలు. గతంలో ఒక మార్కు సాధించటానికి దేశానికి 50 ఏళ్లు పడితే.. తాజాగా అదే మార్కును కేవలం ఏడాది వ్యవధిలో చేరుకోవటం చూసినప్పుడు.. దేశీయ ఆర్థిక రంగం ఎంత దూకుడుగా వెళుతుందన్న విషయం అర్థమవుతుంది. పెరుగుతున్న దేశ ప్రజల సంపాదనలకు తగ్గట్లే.. వివిధ రంగాలు మరింత వేగంగా దూసుకెళుతున్నాయి. తాజాగా దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలు కనిపించాయి.
దేశ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వాహణలోని ఆస్తుల విలువ 2023 డిసెంబరు చివరికు అరుదైన రికార్డును నమోదు చేసింది. తాజాగా ఈ ఆస్తుల విలువ ఏకంగా రూ.50లక్షల కోట్ల మార్క్ ను దాటేశాయి. గత ఏడాది మొత్తమ్మీదా ఫండ్స్ నిర్వాహణ ఆస్తులు 27 శాతం వ్రద్ధి చెందాయి.
2021 చివరి నాటికి దేశీయ మ్యూచువల్స్ ఫండ్స్ సంస్థ ఆస్తులు రూ.38.88 లక్షల కోట్లుగా ఉంటే.. 2022 చివరకు రూ.39.88లక్షల కోట్లకు చేరుకుంది. అయితే.. గత ఏడాది చివరకు మాత్రం ఏకంగా రూ.50.77 లక్షల కోట్లకు చేరుకోవటం గమనార్హం. ఈక్విటీ మార్కెట్లలో ఆశావహ ధోరణి.. మ్యూచువల్ ఫండ్స్ పట్ల పెరుగుతున్న అవగాహన.. బలమైన ఆర్థిక మూలాలు.. ఫండ్స్ పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ.. ఇవన్నీ సానుకూలాంశాలుగా చెప్పాలి. గడిచిన 11 ఏళ్లుగా వరుసగా ఫండ్స్ నిర్వాహణ ఆస్తులు పెరుగుతున్నాయి.
ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొదటి రూ.10లక్షల కోట్ల నిర్వహణ ఆస్తుల్ని సమకూర్చుకోవటానికి 50 ఏళ్లు పడితే.. తాజాగా ఏడాది (2023లో) వ్యవధిలోనే రూ.10 లక్షల కోట్ల మార్కును దాటేసింది. 2022 చివరకు రూ.39.88 లక్షల కోట్ల నుంచి 2023 డిసెంబరు చివరకు రూ.50.77 లక్షల కోట్లకు వెళ్లటమే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. 2023 డిసెంబరులో ఈక్విటీ ఫండ్స్ లోకి రూ.16,997 కోట్లు వచ్చాయి. నవంబరులో రూ.15,536 కోట్లు వచ్చాయి. అంటే.. నెల వ్రద్ధి రేటు 9.4శాతంగా ఉండటం గమనార్హం. ఏమైనా దేశం పురోగతి దిశగా పరుగులు తీస్తుందన్నది నిజమని చెప్పక తప్పదు.