Begin typing your search above and press return to search.

85-85-85.. మహారాష్ట్రలో ఎంవీఏ సీట్ల లెక్క కుదిరింది

ప్రాంతీయ పార్టీల చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

By:  Tupaki Desk   |   23 Oct 2024 4:25 PM GMT
85-85-85.. మహారాష్ట్రలో ఎంవీఏ సీట్ల లెక్క కుదిరింది
X

దేశంలో అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ రాష్ట్రంలో నవంబరు 20న ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది. అదే నెల 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే, మహారాష్ట్రలో గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా తేడా ఉంది అప్పుడు శివసేన, ఎన్సీపీ ఒక్కటిగా ఉన్నాయి. ఇప్పుడు రెండు శివసేనలు, రెండు ఎన్సీపీలు అయ్యాయి. వీటికితోడు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ సరేసరి. ప్రాంతీయ పార్టీల చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరొక్క మాట ఏమంటే.. ఈ ఎన్నికలతో అసలైన శివసేన, ఎన్సీపీ ఏమిటో తేలిపోనుంది.

అటు మహాయుతి.. ఇటు మహా వికాస్ అఘాడీ

మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ -ఎన్సీపీ (శరద్ పవార్)తో పాటు కాంగ్రెస్ పార్టీలతో కూడినదే మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ). ఈ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కొల్కికి వచ్చింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో ఈ మూడు పార్టీలు 85 సీట్ల చొప్పున పోటీ చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతానికి మొత్తం 270 నియోజకవర్గాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇంకా 18 సీట్లపై సమాజ్‌ వాదీ ఇతర ఇండియా కూటమి పార్టీలతో చర్చించాక నిర్ణయించనున్నారు. అయితే, సమాజ్‌ వాదీ పార్టీ 12 సీట్లు ఆశిస్తున్నది. ఐదు చోట్ల అభ్యర్థులనూ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై తుది ఒప్పందం చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. చిన్న పార్టీలు ఆగ్రహంగా ఉన్న సమయంలోనే.. సీట్ల ఒప్పందం ప్రకటన వెలువడడింది. సమాజ్‌వాదీ, ఆప్‌, వామపక్షాలు, పీడబ్ల్యూపీ పార్టీలు మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉన్నాయి.

కాగా, మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ (అజిత్ పవార్)- శివసేన (శిందే)లతో కూడిన కూడిన మహాయుతి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) ఇప్పటికే 38 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేసింది. అజిత్ తమ కుటుంబానికి కంచుకోట బారామతిలో పోటీకి దిగుతున్నారు. ఇక శివసేన (శిందే) 45 మంది అభ్యర్థులతో మంగళవారం మొదటి జాబితాను ప్రకటించింది. సీఎం ఏక్ నాథ్‌ శిందే కోప్రి-పచ్‌పఖాడి నుంచి పోటీ చేయనున్నారు.

ఉద్ధవ్ పార్టీ 65 సీట్లకు..

గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి ఫలితాల తర్వాత కాంగ్రెస్-ఎన్సీపీలతో జట్టుకట్టిన శివసేన.. రెండేళ్ల కిందట నిలువునా చీలిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో శివసేన (ఉద్ధవ్) పార్టీ 65మందితో జాబితా విడుదల చేసింది. ముంబై వర్లి నుంచి మాజీ సీఎం, శివసేన (ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే పోటీ చేయనున్నారు.