Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... వైసీపీ నేత ఎంవీవీ ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు!

వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు, ఆఫీసుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టింది

By:  Tupaki Desk   |   19 Oct 2024 7:08 AM GMT
బిగ్  బ్రేకింగ్... వైసీపీ నేత ఎంవీవీ ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు!
X

వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు, ఆఫీసుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టింది. లాసన్స్ బే కాలనీలోని ఇల్లు, ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇదే సమయంలో... మధురవాడలోని ఎంవీవీ సిటీ ఆఫీసులోనూ ఈడీ సోదాలు సాగుతున్నాయని తెలుస్తోంది.

అవును... విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆడిటర్ తో పాటు మరికొందరి భాగస్వాములు, సన్నిహితుల ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహిస్తోంది. అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు నుంచి తీసుకున్న వివరాల ప్రకారం ఈడీ.. ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐర్) నమోదు చేసిందని అంటున్నారు.

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం... విశాఖలోని ఎండాడ కొండపై సర్వే నెంబర్ 92/3లో 12 ఎకరాలను 2008లో విశాఖలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని ప్రభుత్వం వద్ద మార్కెట్ రేటుకే కొనుగోలు చేశారంట. దీనికోసం వయోవృద్ధుల కోసం ఓ హౌసింగ్ ప్రాజెక్ట్ చేపట్టాలని భావించినట్లు చెబుతున్నారు.

అయితే... వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్కడ భారీ విల్లా ప్రాజెక్టులు కట్టాలని ఎంవీవీ & కో ప్లాన్ చేసి వర్క్ స్టార్ట్ చేశారని.. ఇదే సమయంలో పెద్ద ఎత్తున మనీల్యాండరింగ్ కి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయని అంటున్నారు. అదేవిధంగా తనను బెదిరించి ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని సదరు రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని ఆరోపించారు!

అనంతరం ఆయన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. ఆయన ఫిర్యాదు మేరకు ఇటీవల ఎంవీవీ సత్యనారాయణ, అతని ఆడిటర్ వెంకటేశ్వర రావు (జీవీ), గద్దె బ్రహ్మాజీ లపై కేసు నమోదయ్యిందని చెబుతున్నారు! ఈ నేపథ్యంలోనే ఈడీ దాడులు అనే చర్చ స్థానికంగా బలంగా వినిపిస్తోందని తెలుస్తోంది!

కాగా... తెలుగులో పలు చిత్రాలు నిర్మించారు మాజీ ఎంపీ ఎంవీవీ. ఇందులో భాగంగా... గీతాంజలి (2014), అభినేత్రి (2016), లక్కున్నోడు (2017), నీవెవరు (2018) వంటి సినిమాలు తీశారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన లావాదేవీలపై కూడా ఈడీ కేసు నమోదు చేసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఎంవీవీ ఇంటికి సిబ్బంది తాళాలు వేశారు.