Begin typing your search above and press return to search.

వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తుల జప్తు : భూ ఆక్రమణలపై ఈడీ కొరడా

ఈ వ్యవహారంలో మాజీ ఎంపీ ఎంవీవీతోపాటు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీ సూత్రధారులుగా ఈడీ గుర్తించింది.

By:  Tupaki Desk   |   7 Feb 2025 1:34 PM GMT
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తుల జప్తు : భూ ఆక్రమణలపై ఈడీ కొరడా
X

విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణపై ఈడీ కొరడా ఝులిపించింది. హయగ్రీవా భూముల్లో అక్రమ లావాదేవీలపై యాక్షన్ తీసుకుంది. రూ.44.74 కోట్ల విలువైన స్థిర చర ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ వ్యవహారంలో మాజీ ఎంపీ ఎంవీవీతోపాటు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీ సూత్రధారులుగా ఈడీ గుర్తించింది.

విశాఖలోని వృద్ధులు, అనాథలకు ఆశ్రమం నిర్మిస్తామని హయగ్రీవ స్వచ్ఛంద సంస్థ ట్రస్టీ జగదీశ్వరుడు ప్రభుత్వం నుంచి కొంత భూమి తీసుకున్నాడు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ భూములు హయగ్రీవకు అప్పగించగా, ఆయన నుంచి ఎంవీవీ తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఆ భూములను లే అవుట్ వేసి ప్లాట్స్ గా విక్రయించారని హయగ్రీవ ట్రస్టీ జగదీశ్వరుడు మాజీ ఎంపీపై ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ కేసు నమోదు చేయగా, మనీలాండరింగ్ అభియోగాలపై ఈడీ కూడా దర్యాప్తు చేసింది. గత ఏడాది అక్టోబరులో ఎంవీవీ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసింది. అదేవిధంగా ఆయన ఆడిటర్ జీవీ ఆఫీసులోనూ తనఖీలు చేపట్టి కొన్ని ఫైళ్లు స్వాధీనం చేసుకుంది. నకిలీ పత్రాలు తయారు చేసే డిజిటల్ యంత్రాలు, వివిధ పత్రాలను సీజ్ చేసింది. వీటి ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ అధికారులు హయగ్రీవ భూముల అక్రమ లావాదేవీల ద్వారా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సుమారు రూ.150 కోట్లు ఆర్జించినట్లు గుర్తించింది.

ఈడీ అటాచ్మెంటుతో హయగ్రీవ భూముల్లో అక్రమాలు జరిగినట్లు ధ్రువీకరించినట్లైందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వృద్ధులు, అనాథల కోసం కేటాయించిన భూములను చెరబెట్టి ఎంవీవీ కోట్ల రూపాయలను కొల్లగొట్టారని విమర్శిస్తున్నారు. విశాఖలోని ఎండాడలో హయగ్రీవ ప్రాజెక్టుకు 12.51 ఎకరాల ఉండగా, ఆ భూములను మోసపూరితంగా ఎంవీవీ లాక్కున్నారని గత ఏడాది జూన్ 22న హయగ్రీవ ట్రస్టీ చిలుకూరు జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలిచి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పది రోజులకే జగదీశ్వరుడు మాజీ ఎంపీపై ఫిర్యాదు చేయడం, ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగి ఆస్తులను అటాచ్ చేయడం చకచక జరిగిపోయాయి. ప్రస్తుతం హయగ్రీవ భూముల అక్రమాల ద్వారా ఆర్జించిన మొత్తంలో మూడో వంతు స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా ముందుముందు ఈ కేసులో ఈడీ ఎంతవరకు వెళుతుందనేది చర్చనీయాంశమవుతోంది. ఆస్తులను జప్తు చేసిన ఈడీ ఏమైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.