Begin typing your search above and press return to search.

విశాఖ తూర్పులో ఎంవీవీని తప్పించేస్తారా...!?

మూడు సార్లు గెలవడం వల్ల ఏర్పడిన యాంటీ ఇంకెంబెన్సీ వైసీపీకి కలసి వస్తుందని భావించి అర్ధబలం దండీగా ఉన్న ఎంపీ ఎంవీవీని తెచ్చి తూర్పు సీటు ఇచ్చారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 3:27 AM GMT
విశాఖ తూర్పులో ఎంవీవీని తప్పించేస్తారా...!?
X

విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీకి మరోసారి సవాల్ విసురుతోంది. ఆ మధ్య దాకా కొంచెం ఫర్వాలేదు అని భావించినా జనసేన టీడీపీ పొత్తు తరువాత వైసీపీ ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ జనసేనలోకి జంప్ చేయడంతో తూర్పులో సామాజిక రాజకీయ సమీకరణలలో పెను మార్పులు వచ్చాయి.

వంశీకృష్ణ తూర్పులో నూటికి ఎనభై శాతం ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన రెండు సార్లు పోటీ చేస్తే గెలవలేదు. 2019లో టికెట్ దక్కలేదు. ఈసారి కూడా అవకాశం ఇవ్వలేదు. దాంతో ఆయన పట్ల సొంత సామాజిక వర్గంలో సానుభూతి ఏర్పడింది.

ఇక తనకు టికెట్ రాకపోవడానికి తన రాజకీయ జీవితం నాశనం కావడానికి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కారణం అని జనసేనలో చేరిన నాటి నుంచి వంశీ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. విశాఖలో ఎంవీవీ చేసిన భూ దందాల గురించి పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆయనని వెంటాడి మరీ ఓడిస్తాను అని వంశీ శపధమే చేశారు. వంశీ బీసీ నేత. జనసేనకు ఎటూ బలమైన కాపుల మద్దతు ఉంది. ఈ రెండు సామాజిక వర్గాలూ తూర్పులో గట్టిగా ఉన్నాయి.

ఇక తెలుగుదేశం పార్టీ తూర్పులో పటిష్టంగా ఉంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామక్రిష్ణబాబు నాలుగవసారి గెలిచేందుకు ఈ పరిణామాలు అన్నీ దోహదపడుతున్నాయని అంటున్నారు. నిజానికి చూస్తే ఇటీవల కాలం వరకూ వెలగపూడి మీద వ్యతిరేకత జనంలో ఉంది. బీసీలు ఆయనకు దూరం అయ్యారు. మూడు సార్లు గెలవడం వల్ల ఏర్పడిన యాంటీ ఇంకెంబెన్సీ వైసీపీకి కలసి వస్తుందని భావించి అర్ధబలం దండీగా ఉన్న ఎంపీ ఎంవీవీని తెచ్చి తూర్పు సీటు ఇచ్చారు.

ఆయన పాదయాత్రలు చేస్తున్నారు. జనంలో కనిపిస్తున్నారు కానీ వైసీపీకి మాత్రం గ్రాఫ్ ఎక్కడా పెరగడంలేదు. ఇటీవల నిర్వహించిన సర్వేలలో సైతం భారీ మెజారిటీతో టీడీపీ గెలుస్తుందనే వచ్చింది. దీంతో పాటు ఇపుడు వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ చేసిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ఎంవీవీని ఓడించి తీరుతాను అని సవాల్ చేస్తున్నారు. బీసీ నేతగా ఆయన మాటలు పూర్తిగా జనంలోకి వెళ్తున్నాయి.

ఈ పరిస్థితులను గమనిస్తున్న వైసీపీ అధినాయకత్వం తూర్పులో మార్పులు చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎంవీవీని కొనసాగిస్తే మాత్రం ఓటమి తప్పదు అనే అంటున్నారు. దాంతో 2019లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిన యాదవ సామాజిక వర్గానికి చెందిన అక్రమాని విజయ నిర్మలను ఇటీవల వైసీపీ అధినాయకత్వం పిలిచి చర్చించింది. ఆమెతో ఏమి మాట్లాడారు అన్నది తెలియదు కానీ ఆమెకు చాన్స్ ఉంటుంది అని ప్రచారం అయితే ఉంది.

అదే విధంగా విశాఖ మేయర్ గా గత మూడేళ్ళుగా వివాదరహితంగా పనిచేసుకుంటూ పోతున్న హరి వెంకట కుమారి పేరుని కూడా అధినాయకత్వం సీరియస్ గా పరిశీలిస్తోంది అని అంటున్నారు. ఆమె కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఈ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇవ్వడం ద్వారా తూర్పులో ఈసారి విజయం సాధించాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.

ఎమ్మెల్సీ వంశీ అయితే ఎంపీ ఎంవీవీని ఓడించి తీరుతాను అని అంటున్నారు. ఆయనకు ఆ అవసరం అవకాశం ఇవ్వకుండానే వైసీపీ దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా అన్న చర్చ అయితే తూర్పు నియోజకవర్గంలో సాగుతోంది.