అధికారం చేజారి 2 నెలలు కాకముందే మైలవరం వైసీపీ ఆఫీసు మూసేయటమా?
అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేసేందుకు నేతలు.. కార్యకర్తలు ఉంటారు.
By: Tupaki Desk | 5 Aug 2024 5:20 AM GMTఅధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేసేందుకు నేతలు.. కార్యకర్తలు ఉంటారు. నిజానికి ఒక పార్టీ బలం అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మరింత బాగా అర్థమవుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీకి దన్నుగా ఉండే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంత ముఖ్యమన్న విషయాన్ని చెబుతుంది. ఏపీలో గడిచిన ఐదేళ్లు తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించిన వైసీపీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ఉన్న లోటుపాట్లు బయటకు వస్తున్నాయి.
తాజాగా అలాంటి ఉదంతమే మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వెల్లడైంది. పార్టీ ఓడి రెండు నెలలు కూడా కాకముందే.. నియోజకవర్గ పార్టీ ఆఫీసును మూసేయటం షాకింగ్ గా మారింది. ఎన్నికలకు కాస్త ముందుగా వైసీపీ సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావును ప్రకటించారు. దీంతో.. పార్టీ నేత నాగిరెడ్డికి చెందిన బిల్డింగ్ లో పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఎన్నికల విషయంలో గెలుపు ధీమాతో ఉండటం.. అధికారపక్షం కావటంతో పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున హడావుడి చేశారు. భారీ హోర్డింగులతో పాటు.. పార్టీ తరఫు ప్రచార కార్యక్రమాలు.. పార్టీ కార్యకలాపాల్ని నిర్వహించారు. అయితే.. ఎన్నికల్లో 42 వేల ఓట్ల తేడాతో ఓడిపోవటం స్థానిక నేతలకు షాక్ తగిలినంత పనైంది. ఓటమితో డీలా పడిపోవటం ఒక ఎత్తు అయితే.. ఎన్నికలకు ముందు పార్టీ అధినాయకత్వం నియమించిన ముగ్గురు పరిశీలకులు అందుబాటులోకి రావట్లేదు.
ఇక.. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి సైతం పార్టీ కార్యాలయ నిర్వహణ భారంగా మారిందంటూ చేతులు ఎత్తేశారు. దీంతో.. పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది. దీంతో.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పార్టీ కార్యాలయాన్ని మూసేశారు. ఇందులో భాగంగా తాజాగా ఫ్లెక్సీలు.. హోర్డింగులను తీసేశారు. ఆర్థిక వనరులు ఉన్న ఇన్ ఛార్జి వచ్చేవరకు పార్టీ ఆఫీసు ఓపెన్ అయ్యే అవకాశం లేదంటున్నారు. ఈ వ్యవహారం నియోజకవర్గంలోని పార్టీ నేతలు.. కార్యకర్తలు.. సానుభూతిపరులకు మింగుడుపడని వ్యవహారంగా మారింది. పార్టీ చేతికి అధికారం మిస్ అయిన రెండు నెలలకే చేతులు ఎత్తేసే వారి గురించి పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుందా? అలాంటి తప్పుడు నిర్ణయాలు ఇకముందు తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.