Begin typing your search above and press return to search.

రేవంత్‌కు మైనంపల్లి షాక్.. ఏకంగా ఇంటి ముందు ధర్నా చేస్తానంటూ..

హైదరాబాద్ రాజకీయాల్లో ప్రముఖ నాయకుల్లో మైనంపల్లి హన్మంతరావు కూడా ఒకరు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.

By:  Tupaki Desk   |   1 Oct 2024 8:20 AM GMT
రేవంత్‌కు మైనంపల్లి షాక్.. ఏకంగా ఇంటి ముందు ధర్నా చేస్తానంటూ..
X

హైదరాబాద్ రాజకీయాల్లో ప్రముఖ నాయకుల్లో మైనంపల్లి హన్మంతరావు కూడా ఒకరు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. మెదక్ జిల్లా కొర్విపల్లి గ్రామంలో జన్మించిన మైనంపల్లి 2018లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే మల్కాజిగిరి స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలాగే.. ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ రావు కూడా మెదక్ నుంచి బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ఆరంభించిన మైనంపల్లి.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి తప్పుకొని బీఆర్ఎస్ గూటికి చేరారు.

2014లో బీఆర్ఎస్‌లో చేరిన ఆయన ఆ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2017లో శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018లో మాల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. ఇదిలా ఉండగా.. ఆ పార్టీలో వచ్చిన విభేదాలతో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు. తన కొడుక్కి కూడా సీటు డిమాండ్ చేయడంతో అందుకు బీఆర్ఎస్ అంగీకరించలేదు. అంతేకాకుండా.. కేసీఆర్ ప్రకటించిన జాబితాలో కేవలం మైనంపల్లి హన్మంతరావు పేరు మాత్రమే ఉంది. ఆయన కొడుకు పేరు కనిపించలేదు. దాంతో ఆయన పార్టీ నుంచి తప్పుకున్నారు. కొడుకుకు కూడా సీటు ఇస్తామని చెప్పడంతో ఆ వెంటనే వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇక అప్పటి నుంచి మైనంపల్లి బీఆర్ఎస్ మీద పగబట్టినంత పనిచేశారు. అటు కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూనే.. మరో కీలక నేత హరీశ్ రావు వదల్లేదు. ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఢీ అంటే ఢీ అనే స్థాయికి వెళ్లారు. ఇద్దరి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కూడా ఎన్నికల సమయంలో తారాస్థాయికి చేరాయి. బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని, అందుకు హరీశ్ రావు కారణమంటూ చాలా సందర్భాల్లో విమర్శించారు.

అయితే.. తాజాగా మైనంపల్లి వ్యవహారం, ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా చర్చకు దారితీశాయి. పట్టువదలని విక్రమార్కుడిలా హరీశ్ రావు వెంటే పడుతున్న మైనంపల్లి.. తాజాగా హరీశ్‌ను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఏకంగా రేవంత్ రెడ్డి ఇంటి ముందు బైఠాయిస్తానని హెచ్చరించారు. దాంతో ఈ పరిణామం కాస్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా చాలా మంది భూములు కోల్పోయారు. అయితే.. ఈ అంశంపై మైనంపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు భూములను తప్పించారని ఆరోపించారు. రెండు రోజుల్లో తాను హరీశ్ భూములను సందర్శిస్తానని చెప్పారు. అంతేకాదు.. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. సొంత పార్టీ నేత నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినిపించడంతో ఇప్పుడు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.