బీఆర్‌ఎస్ టికెట్ల కలకలం.. బావకే అన్నాచెల్లెలు మద్దతు!
తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 22 Aug 2023 6:41 AM GMTతెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరో 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో మల్కాజిగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ముఖ్యంగా కేసీఆర్ మేనల్లుడు, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీష్‌రావు అంతు చూసేవరకు వదలబోనని వ్యాఖ్యానించారు. హరీష్ రావు గతం గుర్తించుకోవాలన్నారు. తన నియోజకవర్గాన్ని వదిలి తమ జిల్లాలో పెత్తనం చేస్తున్నాడని విమర్శించారు. హరీష్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోనన్నారు. అక్రమంగా రూ. లక్ష కోట్లు సంపాదించాడని మైనంపల్లి ఆరోపించారు. సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానన్నారు. మెదక్‌లో తన తనయుడు.. మల్కాజిగిరిలో తాను పోటీ చేస్తామని మైనంపల్లి తెలిపారు.
మైనంపల్లి వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు నిబద్ధత, పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి గుర్తు చేశారు. హరీష్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను కవిత తీవ్రంగా వ్యతిరేకించారు.
మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా పరోక్షంగా మైనంపల్లి వ్యాఖ్యలను తప్పుబట్టారు. తామంతా హరీశ్ రావుతోనే ఉంటామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ మూల స్తంభాల్లో హరీశ్ రావు ఒకరని కేటీఆర్ గుర్తు చేశారు. హరీశ్ రావుపై తమ పార్టీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని వెల్లడించారు. ఈ మేరకు అమెరికాలో ఉన్న కేటీఆర్ ట్వీట్ చేశారు.
అలాగే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు దక్కించుకున్నవారికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్లలో తనకు మరోసారి అవకాశం కల్పించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా జీవితంలో నిరాశ తప్పదన్నారు. కొన్నిసార్లు మంచి నేతలకు, ప్రజా సేవ చేసే క్రిశాంక్ వాటి వారితో పాటు మరికొందరికి టికెట్ రాకపోవచ్చని వ్యాఖ్యానించారు. వారికి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రాకపోయినా మరో రూపంలో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
మరోవైపు మైనంపల్లి హన్మంతరావు తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేయలేదు. ఆయన ఎక్కడా తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో తాను, తన కుమారుడు మల్కాజిగిరి, మెదక్ నుంచి పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఇందులో ఇసుమంత కూడా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు తాజాగానూ మరోసారి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తన భవిష్యత్ ను వెల్లడిస్తానన్నారు.
ఈ నేపథ్యంలో మైనంపల్లిపై కేసీఆర్ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు ఎవరి ఆశీస్సులు, అండదండలు లేకుండా మైనంపల్లిలాంటివారికి ఏకంగా హరీశ్ రావును విమర్శించేంత ధైర్యసాహసాలు ఉండవని అంటున్నారు. ఇందులో ఏదో మతలబు ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు కూడా మైనంపల్లిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం ఇందుకు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు.