Begin typing your search above and press return to search.

పెద్ద నేత ఫోన్‌ చేసి మీడియాతో మాట్లాడవద్దన్నారు: మరోసారి మైనంపల్లి హాట్‌ కామెంట్స్‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్‌ మొత్తం 119 స్థానాలకు గానూ 115 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Aug 2023 9:53 AM GMT
పెద్ద నేత ఫోన్‌ చేసి మీడియాతో మాట్లాడవద్దన్నారు: మరోసారి మైనంపల్లి హాట్‌ కామెంట్స్‌!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్‌ మొత్తం 119 స్థానాలకు గానూ 115 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా మరో నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో మల్కాజిగిరి స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు సీటు లభించింది.

అయితే మైనంపల్లి తనకే కాకుండా తన కుమారుడికి కూడా సీటు (మెదక్‌ నుంచి) కావాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన కేసీఆర్‌ మేనల్లుడు, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారితీశాయి. ఆయన అంతు చూసేవరకు వదలబోనని.. సిద్ధిపేటలో హరీశ్‌ పతనం చూస్తానని మైనంపల్లి హన్మంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సిద్ధిపేటను అభివృద్ధి చేసుకుని మల్కాజిగిరిని కీప్‌ లాగా చూస్తున్నాడని హరీశ్‌ పై మండిపడ్డారు.

మైనంపల్లి వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. మరోవైపు మైనంపల్లిపై బీఆర్‌ఎస్‌ అధిష్టానం చర్యలు తీసుకుంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి సీటును వేరే వారికి కేటాయిస్తారని అంటున్నారు.

పరిణామాలు ఇలా ఉండగా తాజాగా మైనంపల్లి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఒక పెద్ద నేత ఫోన్‌ చేశారని.. మీడియా ముందు మాట్లాడొద్దని తనతో ఒట్టు వేయించుకున్నారని బాంబుపేల్చారు. అయితే ఆ పెద్ద నేత ఎవరో మైనంపల్లి వెల్లడించలేదు. తాజాగా మైనంపల్లి మల్కాజిగిరి, మెదక్‌ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, తన అనుచరులు, శ్రేయోభిలాషులతో భారీ సమావేశం నిర్వహించారు. మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలో జరిగిన ఈ సమావేశానికి భారీ ఎత్తున తరలివచ్చారు.

ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్‌ఎస్‌ పార్టీని ఏమీ అనలేదని.. అలాగే పార్టీ కూడా తనను ఏమీ అనలేదని తెలిపారు. తనను వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టినా, విమర్శించినా తాను కూడా విమర్శిస్తానని హెచ్చరించారు. చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుందన్నారు.

జీవితంలో స్థిరపడటం అంటూ ఉండదన్నట్టు.. చనిపోయిన తర్వాతే జీవితంలో స్థిరపడినట్లు.. టీడీపీలో ఉన్నప్పుడు మెదక్‌ జిల్లా అధ్యక్షుడిగా 8 ఏళ్లు పనిచేశానని గుర్తు చేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరానన్నారు. ఏ పార్టీలో ఉన్నా.. వెన్నుపోటు పొడిచే అలవాటు తనకు లేదన్నారు.

ప్రాణం పోయే వరకు మాటపైనే ఉంటానని మైనంపల్లి తెలిపారు. మెదక్‌ ప్రజలు తనకు రాజకీయ ప్రాణభిక్ష పెట్టారన్నారు. తానెప్పుడూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీని తిట్టలేదన్నారు. అంతా కలిస్తేనే తెలంగాణ సాకారమైందని గుర్తు చేశారు. మల్కాజిగిరిలో వారం రోజులపాటు అనుచరులందరినీ కలుస్తానని తెలిపారు. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. వారం తర్వాత మీడియాను పిలిచి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

తన కొడుకుకు 25 ఏళ్లేనని.. ఇంకా భవిష్యత్‌ ఉందన్నారు. తన కొడుకు తన కంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మైనంపల్లి చెప్పుకొచ్చారు. మెదక్‌ లో తన కుమారుడు తిరిగి ప్రజాభిప్రాయం కోరతాడు అని మైనంపల్లి చెప్పారు. తన కుమారుడిని సెటిల్‌ చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కరోనా సమయంలో రూ.8 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేశాడని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మైనంపల్లి వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.