మైనంపల్లి.. అంతా ఊహించినట్టే!
ఈ సమావేశాల్లో మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఆయనతో మాట్లాడినట్టు టాక్ నడిచింది.
By: Tupaki Desk | 23 Sep 2023 3:49 AM GMTతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్‌ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే కీలక నేతలు.. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వంతు వచ్చింది. ఆయన తాజాగా బీఆర్‌ఎస్ కు రాజీనామా ప్రకటించారు. దీంతో కేసీఆర్ కు గట్టి షాక్ తగిలింది.
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనతోపాటు తన కుమారుడు రోహిత్ కు కూడా మైనంపల్లి హన్మంతరావు సీట్లు ఆశించారు. ఇందులో భాగంగా తనకు ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి, తన కుమారుడికి మెదక్ అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన కుమారుడికి మెదక్ నుంచి టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాడని బెదిరించారు. అయితే ఇటీవల కేసీఆర్ ప్రకటించిన జాబితాలో కేవలం మైనంపల్లి హన్మంతరావుకు మాత్రమే సీటు లభించింది. ఆయన కుమారుడు రోహిత్ కు సీటు దక్కలేదు.
మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడికి సీటు ఆశించిన మెదక్ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే దక్కింది. దీంతో అప్పటి నుంచి మైనంపల్లి అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇటీవల తిరుపతి దర్శనానికి వచ్చిన ఆయన కేసీఆర్ మేనల్లుడు, తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలు తీవ్ర కాకరేపాయి. హరీశ్ రావు అంతు చూస్తానని.. ఆయన పతనమే తన లక్ష్యమంటూ మైనంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. బీఆర్‌ఎస్ మూలస్తంభాల్లో హరీశ్ ఒకరని వారు కొనియాడారు.
అప్పట్లో బీఆర్‌ఎస్ అధిష్టానం మైనంపల్లిపై వేటు వేస్తుందనే వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. మైనంపల్లి ఏం చేస్తారో చూశాకే తన నిర్ణయం అన్నట్టు కేసీఆర్ వ్యవహరించారు.
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ లో జరిగాయి. ఈ సమావేశాల్లో మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వచ్చాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఆయనతో మాట్లాడినట్టు టాక్ నడిచింది. అయితే ఆయన తనకు, తన కుమారుడికి కూడా సీట్లు అడుగుతుండటంతో దీనిపై పీటముడి పడిందని వార్తలు వచ్చాయి.
అయితే కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టును ప్రకటించనున్న నేపథ్యంలో ఆలస్యం చేస్తే మొదటికే మోసం చేస్తుందని భావించిన మైనంపల్లి ఎట్టకేలకు బీఆర్‌ఎస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన తన కుమారుడితో కలిసి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి పార్టీలో చేరతారని చెబుతున్నారు.
ఈ మేరకు మైనంపల్లి హన్మంతరావు వీడియో సందేశం ద్వారా బీఆర్‌ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరబోతున్నానో త్వరలో ప్రకటిస్తానని చెప్పారు.
మల్కాజిగిరి ప్రజలు, తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు చెందిన తన మద్దతుదారులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకే తాను బీఆర్‌ఎస్ కు రాజీనామా చేశానని మైనంపల్లి తెలిపారు. తాను జీవించి ఉన్నంత వరకు తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తానని, లొంగిపోయే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టారు.