Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో రేవంత్, ఉత్తం తర్వాత మైనంపల్లే... ఏమిటీ ఈయన స్పెషాలిటీ?

రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీచేస్తున్నారని చెబుతుండగా... ఉత్తం కుటుంబానికీ రెండు టిక్కెట్లు దక్కాయి. ఉత్తం కుమార్ రెడ్డి, అతని సతీమణి హుజూర్ నగర్, కోదాడల్లో పోటీ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 5:04 AM GMT
కాంగ్రెస్  లో రేవంత్, ఉత్తం తర్వాత మైనంపల్లే... ఏమిటీ ఈయన  స్పెషాలిటీ?
X

ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఫుల్ హడావిడిలో ఉన్నాయి. ఇటీవల ఎన్నికలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన టీడీపీ మినహా... అన్ని పార్టీలూ అభ్యర్థుల ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలతో సందడి సందడిగా ఉన్నాయి. ఈ సమయంలో బీఆరెస్స్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్నారు టి.కాంగ్రెస్ నేతలు. ఆ సంగతి అలా ఉంటే... టి.కాంగ్రెస్ లో ముగ్గురు నేతలు మాత్రం ప్రత్యేకంగా నిలిస్తున్నారు. వారిలో మైనంపల్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు!

అవును... తెలంగాణలో టిక్కెట్లు దొరక్క దాదాపు ప్రతీ పార్టీలోనూ అసంతృప్తులు ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అధికార పార్టీ, విపక్ష పార్టీ అనే తారతమ్యాలేమీ లేవు. కొంతమంది పరిస్థితి అలా ఉంటే... టి.కాంగ్రెస్ లో ముగ్గురికి మాత్రం ఒకటికంటే ఎక్కువ స్థానాల్లో పోటీచేసే అవకాశం దక్కిందనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారిలో ఒకరు టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాగా, మరొకరు పీసీసీ మాజీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి. ఇక మూడో వ్యక్తి మైనంపల్లి హన్మంతరావు.

రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీచేస్తున్నారని చెబుతుండగా... ఉత్తం కుటుంబానికీ రెండు టిక్కెట్లు దక్కాయి. ఉత్తం కుమార్ రెడ్డి, అతని సతీమణి హుజూర్ నగర్, కోదాడల్లో పోటీ చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి.. కొడంగల్ తో పాటు కామారెడ్డి లోనూ నిలబడుతున్నారని తెలుస్తుంది! ఇదే సమయంలో వీరితో పాటు బీఆరెస్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మైనంపల్లి హన్మంతరావు కు రెండు స్థానాలు దక్కాయి.

వాటిలో మల్కాజిగిరి స్థానం నుంచి మైనాంపల్లి హన్మంతరావు, మెదక్ నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ రావు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. దీంతో... మైనంపల్లి హన్మంత రావు పొలిటికల్ కెరీర్ & బ్యాక్ గ్రౌండ్ పై ఒక చర్చ మొదలైంది.

తెలుగుదేశం పార్టీ నుంచి 1998లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మైనంపల్లి హన్మంతరావు. ఈ క్రమంలో 2008లో జరిగిన ఉపఎన్నికలో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదే క్రమంలో... 2009 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమ్మెల్యే అభ్యర్థి శశిధర్ రెడ్డిపై 21,151 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఈ క్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఈ సమయంలో అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ బీజేపీ - టీడీపీలు పొత్తులో రంగంలోకి దిగాయి. దీంతో... మైనంపల్లికి టిక్కెట్ దక్కలేదు. దీంతో... టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ కూడా టిక్కెట్ దక్కకపోవడంతో... ఆ పార్టీలో రెండు రోజులున్న ఆయన.. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆరెస్స్)లో చేరారు!

అయితే నాడు టీఆరెస్స్ నుంచి టిక్కెట్ దక్కినా... విజయం మాత్రం దక్కలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మైనంపల్లి... టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2015లో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి నుంచి టీఆరెస్స్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు.

ఈ క్రమంలో ఈసారి తనతో పాటు తన కుమారుడికి కూడా టిక్కెట్ కావాలని అడిగారు మైనంపల్లి. దీంతో... ఆ డిమాండ్ కు బీఆరెస్స్ అంగీకరించలేదు. వెంటనే కారు దిగిన మైనంపల్లి... కాంగ్రెస్ పార్టీకి జైకొట్టారు. అక్కడ కాంగ్రెస్ మాత్రం మైనంపల్లి డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంది. తండ్రీకొడుకులిద్దరికీ టిక్కెట్లు ఇచ్చింది. దీంతో... మల్కాజిగిరి నుంచి హన్మతరావు, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్ రావులు రంగంలోకి దిగుతున్నారు. ఫలితం ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి!