టికెట్లకు మైనంపల్లి మహా లొల్లి.. హరీశ్ పై నిప్పులు
తిరుమల శ్రీవారి సన్నిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (మల్కాజ్ గిరి) సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 21 Aug 2023 9:58 AM GMTతిరుమల శ్రీవారి సన్నిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (మల్కాజ్ గిరి) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తన కుమారుడికి ఇద్దరికీ టికెట్ కావాలంటూ బీఆర్ఎస్ అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చారు. తన కుమారుడు ఎందుకు అర్హుడో వివరిస్తూ మంత్రి హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాడు టీడీపీ నుంచి
మైనంపల్లి హనుమంతరావు ఆర్థికంగా బలమైన వారు. వ్యాపారంలో బాగా రాణించారు. 2009లో ఆయన మెదక్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత మల్కాజ్ గిరికి మారారు. బీఆర్ఎస్ తరఫున 2018లో గెలిచారు. హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. అయితే, ఆయన మెదక్ తో సంబంధాలను కొనసాగించారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మెదక్ స్థానాన్నీ కోరుతున్నారు. సోమవారం తిరుమల వెంకన్న దర్శనం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. "నా కుమారుడు డాక్టర్ రోహిత్ ను ఎమ్మెల్యే చేయడమే లక్ష్యం. మెదక్, మల్కాజ్ గిరి టికెట్లను మాకు ఇవ్వాల్సిందే. అలాగైతేనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తాం. ఒకవేళ ఇద్దరికీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రులుగా నిలుస్తాం. కొవిడ్ వైరస్ వ్యాప్తి సమయంలో నా కుమారుడు ఎంతో ప్రజాసేవ చేశాడు. దాదాపు 8 కోట్లు సొంత డబ్బు ఖర్చు చేశాడు" అని మైనంపల్లి తెలిపారు. ఇదే సమయంలో మంత్రి హరీశ్ రావుపైనా మైనంపల్లి నిప్పులు చెరిగారు.
ట్రంకు పెట్టెతో వచ్చాడు హరీశ్
కాలికి రబ్బరు చెప్పులు, చేతిలో ట్రంకు పెట్టతో హరీశ్ రావు వెలమ హాస్టల్ కు వచ్చారని.. ఆ సంగతి తాను స్వయంగా చూశానని.. ఈ రోజు ఆయన రూ.లక్ష కోట్లు సంపాదించారని మైనంపల్లి తీవ్రంగా ఆరోపించారు. అసలు మెదక్ లో హరీశ్ పెత్తనం చేస్తున్నారని, ఆయన అంతుచూసే వరకు వదలబోనని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో హరీశ్ రావును అడ్రస్ లేకుండా చేస్తానని మండిపడ్డారు. తన కుమారుడికి మెదక్ టికెట్ ఇస్తేనే తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సిద్దిపేట ను హరీశ్ డెవలప్ చేశారని.. కార్యాలయాలన్నీ పట్టుకెళ్లారని.. మరి మెదక్ ను ఎవరు బాగుచేస్తారని మైనంపల్లి ప్రశ్నించారు.
మెదక్ టికెట్ రాలే..
మైనంపల్లి అల్టిమేటంను బీఆర్ఎస్ అధిష్ఠానం పట్టించుకోనట్లుంది. సోమవారం మధ్యాహ్నం వెల్లడించిన జాబితాలో మెదక్ సీటును సిటింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికే కేటాయించింది. ఈ పరిణామం మైనంపల్లికి షాకే. అయితే, మైనంపల్లికి మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చారు. మరిప్పుడు ఆయన ఏం చేస్తారో చూడాలి.