అందాల కశ్మీర్ మంచు కొండల్లో.. మిస్టరీ మరణాలు
ఇక్కడి రాజౌరీ జిల్లా బుధాల్ గ్రామంలో 45 రోజుల్లో 15 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయారు.
By: Tupaki Desk | 16 Jan 2025 12:15 PM GMTకశ్మీర్ అంటే దాల్ సరస్సు సోయగం.. కశ్మీర్ అంటే హిమాలయ పర్వతాల అందం.. అలాంటి కశ్మీర్ ను చూడాలంటే ఇప్పుడే సరైన సమయం.. నిండా మంచు దుప్పటిని కప్పుకొని ఉండే హిమాలయాల సొగసు ఎంత చూసినా తీరనిది. అయితే, తాజాగా కశ్మీర్ కొండల్లో మిస్టరీ మరణాలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇక్కడి రాజౌరీ జిల్లా బుధాల్ గ్రామంలో 45 రోజుల్లో 15 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయారు.
వైరస్ దాడి జరిగిందా..?
మంచు విపరీతంగా కురిసే ఈ కాలంలో రాజౌరీ జిల్లాలో వరుస మరణాలకు ఏమైనా వైరస్ దాడి కారణమా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్న నేపథ్యంలో బ్యాక్టీరియా కానీ, సాంక్రమిక వ్యాధులు సోకాయా? అని కూడా భావించారు. కానీ, ఇవేవీ కారణం కాదని తేలింది. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం నిశితంగా ఫోకస్ పెట్టింది. వరుస మరణాలపై
11 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఆ విందే కారణమా?
బుధాల్ లో డిసెంబర్ 7న విందు జరిగింది. అనంతరం ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురు చనిపోయారు. గత నెల 12న మరో కార్యక్రమంలో విందు ఆరగించిన మరో కుటుంబంలోని 9 మంది అనారోగ్యం బారిన పడ్డారు. ముగ్గురు చనిపోయారు. ఈ నెల 12న ధావత్ లో పాల్గొన్న మరో కుటుంబంలోని పదిమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం పదేళ్ల బాలిక చనిపోయింది. నెలన్నరలోనే 15 మంది చనిపోవడం బుధాల్ గ్రామంలో భయాందోళనలకు కారణమైంది.
కశ్మీర్ వైద్యాధికారులు.. బాధితుల నమూనాలను ఎన్‌ఐవీ (పుణె), ఎన్‌సీడీసీ (దిల్లీ), ఎన్‌ఐటీఆర్ (లక్నో), డీఆర్‌డీఈ (గ్వాలియర్), చండీగఢ్, జమ్మూలలో ఉన్న ల్యాబ్ లకు పంపారు. మరణాలకు వైరస్ లేదా బ్యాక్టీరియా కారణం కాదని తేలింది. ఐఐటీఆర్ (టాక్సికాలజీ రీసెర్చ్) నిర్వహించిన విశ్లేషణలో మాత్రం ఆ నమూనాల్లో విష పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కశ్మీర్ ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తునకు ఆదేశించింది.