Begin typing your search above and press return to search.

నా చెల్లెమ్మ బర్రెలక్క అంటూ...పవన్ గాలి తీసేశారుగా...

దీని మీదనే అతి పెద్ద రాజకీయ విశ్లేషణ మొదలైంది. అంతే కాదు సోషల్ మీడియాలో సెటైర్లు ఒక్క లెక్కన పవన్ మీద పడిపోతూ వచ్చాయి.

By:  Tupaki Desk   |   14 Dec 2023 10:02 AM GMT
నా చెల్లెమ్మ బర్రెలక్క అంటూ...పవన్ గాలి తీసేశారుగా...
X

జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణాలో ఎందుకు పోటీ చేశారో దాని వెనక ఆయన వ్యూహాలు ఏమి ఉన్నాయో తెలియదు కానీ ఏపీలో మాత్రం ఆయన అధికార వైసీపీకి అడ్డంగా దొరికిపోయారు అని అంటున్నారు. తెలంగాణాలో ఎనిమిది చోట్ల పోటీ చేస్తే ఏడు చోట్ల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. పోనీ ఓట్లు అయినా గట్టిగా వచ్చాయా అంటే అన్నీ రెండు మూడు నాలుగు వేల మధ్యలో వచ్చాయి.

అదే టైం లో బర్రెలక్క ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఏకంగా అయిదు వేల పై చిలుకు ఓట్లు పడ్డాయి. దీని మీదనే అతి పెద్ద రాజకీయ విశ్లేషణ మొదలైంది. అంతే కాదు సోషల్ మీడియాలో సెటైర్లు ఒక్క లెక్కన పవన్ మీద పడిపోతూ వచ్చాయి. ఇపుడు సీఈం జగన్ వంతు అన్నట్లుగా ఉంది. ఆయన గురువారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జరిగిన సభలో మాట్లాడుతూ పవన్ మీద హాట్ కామెంట్స్ చేశారు.

నా చెల్లెమ్మ బర్రెలక్క అంటూ పవన్ పరువుని నిలువునా తీశారు. పవన్ కళ్యాణ్ పార్టీ తెలంగాణాలో పోటీ చేస్తే బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదంటూ ఎత్తిపొడిచారు. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తా అంటూ తెలంగాణా వెళ్ళి డైలాగు కొట్టాడు ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ ఆంధ్రాకు వ్యతిరేకంగా ఆయన అక్కడ డైలాగులు కొడితే పడిన ఓట్లు దారుణం అన్నారు జగన్.

బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని తెలంగాణాలో జనసేన డిపాజిట్లు కోల్పోయింది అని జగన్ చెప్పుకొచ్చారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్క నయం అంటూ జగన్. భారీ సెటైర్ వేశారు. ఇక పవన్ని పట్టుకుని నిన్నటిదాకా ప్యాకేజీ స్టార్ అంటూండే జగన్ ఇపుడు కొత్త పేరు తగిలించారు. అదే మ్యారేజీ స్టార్ అని. అంటే ఆయన మూడు పెళ్ళిళ్ళు దృష్టిలో ఉంచుకుని లేటెస్ట్ గా ఈ కొత్త ట్యాగ్ తెచ్చి పెట్టారని అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఏపీలో అంత సీన్ లేదని వైసీపీ నేతలు అంటూండేవారు. ఇపుడు తెలంగాణాలో వచ్చిన జనసేన ఓట్లను చూపించి ఆ పార్టీ సీన్ ఇంతే అని చెప్పేస్తున్నారు. జగన్ ఇదే మాట అనడంతో ఇక వైసీపీ జనసేన మీద ఈ తరహా కామెంట్స్ ఫ్యూచర్ లో ఎన్నికల వేళ ఇంకా ఎక్కువగా చేస్తుందని అంటున్నారు.

మరో వైపు దత్తపుత్రుడు అన్న ట్యాగ్ మాత్రం పవన్ కి అలాగే ఉంచేశారు. మొత్తానికి పవన్ రాజకీయం ఆయన వ్యూహాలు ఏమో కానీ వైసీపీ మాత్రం ఆయన రెండు రాష్ట్రాల రాజకీయాన్ని జనం ముందు పెట్టి ఒక్క లెక్కన ఆడేసుకుంటోంది అని అర్ధం అవుతోంది. జగన్ అయితే సూటిగానే పవన్ మీద సెటైర్లు వేస్తున్నారు. ఆయన రాజకీయం జనసేన ప్రభావం ఏపీలో ఏమీ లేదు అన్నట్లుగా లైట్ తీసుకుంటూ జనానికీ అదే సందేశం ఇస్తున్నారు. మరి దీనికి కౌంటర్ గా పవన్ పార్టీ ఏ విమర్శలు చేస్తుందో చూడాల్సి ఉంది.