Begin typing your search above and press return to search.

"ఎన్" కన్వెషన్ పై రేవంత్ పట్టుదల ఇప్పటిది కాదా?... వీడియో వైరల్!

ఈ నేపథ్యంలో శనివారం ఉదయం హైడ్రా అధికారులు భారీ భద్రత నడుమ "ఎన్" కన్వెన్షన్ కూల్చివేత మొదలుపెట్టారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 9:44 AM GMT
ఎన్ కన్వెషన్  పై రేవంత్  పట్టుదల ఇప్పటిది కాదా?... వీడియో వైరల్!
X

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన "ఎన్" కన్వెషన్ ను కూల్చేయడం అనే విషయం ఇప్పుడు అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే హాట్ టాపిక్ అని చెప్పినా అతిశయోక్తి కాదన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు తెరపైకి వచ్చింది.

అవును... హైదరాబాద్ లో ఓ మోస్తరు వర్షం వస్తే పలు ప్రాంతాలు,కాలనీలు, రోడ్లు.. కాలువల్లా, నీటి మడుగుల్లా మారిపోతుండటానికి చుట్టూ ఉన్న చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడటమే అనే చర్చ బలంగా ఎప్పటినుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా ను తెరపైకి తెచ్చారు రేవంత్ రెడ్డి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, మొదలైన వాటిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపడం దీని పని!

ఈ నేపథ్యంలో శనివారం ఉదయం హైడ్రా అధికారులు భారీ భద్రత నడుమ "ఎన్" కన్వెన్షన్ కూల్చివేత మొదలుపెట్టారు. ఇదే సమయంలో... ఎన్ కన్వెషన్ నిర్మాణం కూల్చివేత వెనుక రేవంత్ కేబినెట్ లో ఓ కీలక మంత్రి పాత్ర ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. ఆయన పలు ఫ్రూఫ్ లతో హైడ్రా అధికారులు, ముఖ్యమంత్రికి లేఖ రాశారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ కి సంబంధించిన పాత వీడియో వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా... చెరువు మధ్యలో గోడకట్టి మరీ ఈ కన్వెషన్ నిర్మించారని.. మూసాపేట వంటి ప్రాంతాల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే అనుమతులు లేవని కూల్చేసే అధికారులు.. సిటీ నడిబొడ్డున, సైబర్ టవర్స్ కి కూతవేటు దూరంలో ఇలాంటి నిర్మాణం కనిపిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. అంటూ ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ప్రస్థావించారు. ఈ విషయంపై అసెంబ్లీలోనూ మాట్లాడారు.

2016 డిసెంబర్ లో ఈ విషయంపై ఓ టీవీ ఛానల్ తో మాట్లాడిన రేవంత్ రెడ్డి... నాగార్జున అంటే హీరో అని.. హీరో అంటే సామాన్యులకు రోల్ మోడల్ అని.. హీరో వీరోచితంగా పోరాడుతుంటే జనం చప్పట్లు కొడతారని.. అలాంటి హీరో కబ్జాలు చేసి, ఆ విషయంపై మేనేజ్ చేసుకునేటటువంటి వైఖరి మంచిది కాదని అన్నారు.

ఇక కొన్నేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉండగా కూడా ఈ ఎన్ కన్వెషన్ పై స్పందించిన రేవంత్ రెడ్డి... తాము అధికారంలోకి వస్తే ఎన్ కన్వెషన్ ను కూల్చి తీరుతామనేలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు! ఈ నేపథ్యంలో నాడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవి, ఇప్పుడు చేసిన చేతలు ఇవి అంటూ నెట్టింట కామెంట్స్ వైరల్ గా మారాయి.

మరోవైపు... ఈ వ్యవహారం పూర్తిగా చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా.. కూల్చివేతలను తక్షణమే ఆపాలంటూ ఉన్నత న్యాయస్థానం మద్యంతర ఉత్తర్వ్యులు ఇచ్చింది.