కేఎల్ యూనివర్సిటీ కేసు : సీబీఐ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
ఇందుకోసం నాక్ తనిఖీ బృందంలో తమకు అనుకూలమైన అధికారులను నియమించేలా నాక్ సమన్వయకర్త రాజీవ్ సజారియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీబీఐ ఆరోపించింది.
By: Tupaki Desk | 3 Feb 2025 10:46 AM GMTనేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) గ్రేడింగ్ కోసం లంచం ఇచ్చి దొరికి పోయిన KL యూనివర్సిటీ ప్రతినిధుల రిమాండ్ రిపోర్టులో సీబీఐ సంచలన విషయాలను ప్రస్తావించింది. ఈ కేసులో మొత్తం పది మంది నిందితులను అరెస్టు చేయగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే నాక్ గ్రేడింగ్ కోసం తనిఖీ బృందాలకు లంచం ఎరవేయడంపై సీబీఐకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విచారణ చేపట్టిన సీబీఐ మొత్తం కుట్రను బయటపెట్టింది.
దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు నాక్ గ్రేడింగ్స్ ఇస్తుంది. ఈ గ్రేడింగ్ ఆధారంగానే అడ్మిషన్లు వస్తుంటాయి. అయితే మంగళగిరి సమీపంలోని ఉన్న KL యూనివర్సిటీ A ++ ర్యాంకు కోసం నాక్ ప్రతినిధులకు లంచం ఎరవేసినట్లు సీబీఐ బయటపెట్టింది. ఈ కుట్రలో సంస్థ చైర్మన్ తోపాటు కొందరు ప్రముఖులు భాగస్వాములయ్యారని సీబీఐ అభియోగాలు మోపింది.
కెఎల్ యూనివర్శిటీ తన కేఎల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ (KLEF)కి A ++ ర్యాంకు ఇచ్చేలా నాక్ ప్రతినిధులను ఒప్పించేందుకు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోందని సీబీఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ఇందుకోసం నాక్ తనిఖీ బృందంలో తమకు అనుకూలమైన అధికారులను నియమించేలా నాక్ సమన్వయకర్త రాజీవ్ సజారియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. KLEF అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్ సారథి వర్మ, నాక్ డెరైక్టర్ హనుమంతప్ప, మాజీ వైస్ చాన్సలర్ మంజునాథ రావు, సలహాదారు శ్యాం సుందర్ తదితరులు పలుమార్లు నాక్ సభ్యులతో రహస్యంగా సమావేశమైనట్లు సీబీఐ వెల్లడించింది. గత నెల 18, 19 తేదీలలో విజయవాడలో నాక్ డైరెక్టర్ హనుమంతప్ప, సలహాదారు శ్యాం సుందర్‌కు రూ. 10 లక్షలు లంచంగా ముట్టజెప్పారని తెలిపింది.
అదేవిధంగా గత నెల 25న ఢిల్లీలో నాక్ డైరెక్టర్ రాజీవ్ సిజారియాను KLEF ఉపాధ్యక్షుడు రాజా హరీన్, హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్ రామకృష్ణ కలిశారని చెప్పింది. ఆ సమయంలో రాజీవ్ సజారియా నాక్ A ++ గ్రేడింగ్ కావాలంటే తనకు రూ.1.80 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. అయితే ఈ డబ్బు విషయమై ఇరువర్గాల మధ్య ఎన్నో చర్చలు జరగగా, చివరకు నాక్ సభ్యులు ఒక్కొక్కరికి రూ. 3లక్షల నగదు, ఒక ల్యాప్‌టాప్ అందజేసేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిపింది. ఇక చైర్మన్ తోపాటు డైరెక్టర్ రాజీవ్ సజరియాకు చెరో 10 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ డబ్బు మొత్తం నగదు, బంగారం రూపంలో మాత్రమే చెల్లించాలని నాక్ ప్రతినిధులు కోరగా, అందుకు కేఎల్ యూ ప్రతినిధులు ఓకే చెప్పారని సీబీఐ తన రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది.
ఈ రహస్య లావాదేవీలకు సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు విచారణ చేయాల్సివుందని తెలిపింది. అదేవిధంగా మరో అంశంలో రాజీవ్ సజారియా రూ.60 లక్షలు డిమాండ్ చేస్తే, కేఎల్ యూనివర్శిటీ ప్రతినిధులు 15 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారని వెల్లడించింది. మొత్తం ఈ వ్యవహారంలో ప్రముఖులు హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. పూర్తి స్థాయి దర్యాప్తులో మరిన్ని అంశాలు వెలుగుచూసే అవకాశం ఉందని కోర్టుకు నివేదించింది. కాగా, కేఎల్ యూనివర్సిటీ వ్యవహారంతో నాక్ గుర్తింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు తీసుకుని గ్రేడింగులు ఇవ్వడంతో విద్యా ప్రమాణాలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నాక్ తనిఖీల ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.