అమెరికా ఎన్నికల్లో ఊపేస్తున్న నాటు నాటు!
అగ్రదేశమైన అమెరికాలో ఎన్నికల కోలాహలం నెలకొంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది.
By: Tupaki Desk | 9 Sep 2024 6:37 AM GMTఅగ్రదేశమైన అమెరికాలో ఎన్నికల కోలాహలం నెలకొంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. డిబేట్లలోనూ ఎవరికి ఎవరు తీసిపోకుండా పాల్గొంటున్నారు.
మరోవైపు.. అమెరికా ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు మన తెలుగు పాట ‘నాటునాటు’ ఊపేస్తోంది. డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ తన ప్రచారంలో ఈ పాటను వాడుకుంటున్నారు. నాటునాటు స్ఫూర్తితో భారత-అమెరికన్ లీడర్ అజయ్ భుటోరియా ‘నాచో నాచో’ పేరుతో హిందీ గేయాన్ని విడుదల చేశారు. ఇప్పుడు అక్కడి ప్రచారంలో ఎక్కడ విన్నా ఇదే పాట వినిపిస్తోంది. నాచో నాచో కేవలం పాట కాదని.. అది ఒక ఉద్యమం అని ఈ సందర్భంగా అజయ్ వర్ణించారు.
ఇదిలా ఉండగా.. అమెరికాలో ఇండోఅమెరికన్స్ ఓటర్ల సంఖ్య కూడా భారీగానే ఉంది. దాంతో వారి మద్దతు అంతా సాధారణంగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌కే ఉంటుందని అందరూ అనుకున్నారు. వారు సైతం ఇప్పటివరకు కమలా హారిస్‌కు మద్దతు తెలుపుతూ వచ్చారు. అయితే.. ఈ క్రమంలోనే కమలాకు ఊహించని షాక్ తగిలింది. దాంతో ఇప్పటివరకు గెలుపు సునాయసం అనుకున్న కమలా హారిస్.. ఈ ఊహించని షాక్‌తో ఒక్కసారిగా ఆందోళనలో పడిపోయారట.
నిన్నామొన్నటి దాకా కమలా హారిస్‌కు మద్దతు తెలిపిన ఇండోఅమెరికన్స్ ఇప్పుడు ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎక్కడ ఏ లోపం జరిగిందో తెలియదు కానీ.. వారి వాయిస్‌లో ఒక్కసారిగా మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముందు డెమోక్రాట్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడే బైడెన్ బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. అనూహ్య పరిణామాల మధ్య ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్న కమలా హారిస్‌ను ఆ పార్టీ అధ్యక్ష రేసులో నిలబెట్టింది. అయినప్పటికీ ఇండో అమెరికన్లు ఆమె తరఫున వాయిస్ వినిపించారు. హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ సంస్థ కూడా ఆమెకు అండగా నిలిచింది.
దాంతో ట్రంప్ ఇండియన్స్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. కమలా హారిస్ మాటలను నమొద్దని.. ఆమెను చూసి మోసపోవద్దంటూ సూచించారు. అయినప్పటికీ హిందూస్ సంస్థ మౌనంగానే ఉండిపోయింది. ఇప్పుడు మాత్రం ఆ సంస్థ తన వైఖరి మార్చుకుంది. అనూహ్యంగా ట్రంప్‌కు మద్దతు తెలుపుతూ జై కొట్టింది. ఈ మేరకు సంస్థ చైర్మన్, వ్యవస్థాపకుడు సందూజా ఇదే విషయాన్ని వెల్లడించారు.
ట్రంప్‌తోనే భారత్-ఇండియా మధ్య సంబంధాలు బాగుంటాయని సందూజా తేల్చిచెప్పారు. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న యుద్ధాలు.. వాటి వెనకాల ఉన్నది బైడెన్ అన్న వాదనను సమర్థించిన కమలా హారిస్‌ను ఆయన తప్పుబట్టారు. అందుకే.. ఇక నుంచి తాము ట్రంప్ బాటలో నడవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అమెరికాలో నార్త్ కరోలినా, జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, నెవాడ, ఆరిజోనాలలో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి ఓటర్లను హిందూస్ ఫర్ అమెరికా సంస్థ ప్రభావితం చేయగలదు అనే టాక్ ఉంది. అయితే.. ఈ సంస్థ తీసుకున్న తాజా నిర్ణయం అమెరికా అధ్యక్షుడి గెలుపు ఓటములను నిర్ణయిస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే.