కోడి కత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ.. జగన్ పై మంత్రి నాదెండ్ల సెటైర్లు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంటోంది.
By: Tupaki Desk | 6 March 2025 11:34 AM ISTఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంటోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ మాజీ సీఎం జగన్ చేసిన విమర్శలపై అధికార కూటమి మాటలతో విరుచుకుపడుతోంది. మంత్రి నారా లోకేశ్ ఒకవైపు.. జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు మరోవైపు జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాలపై ఆసక్తికర డిబేట్ జరుగుతోంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్పొరేటరుకి ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ మాజీ సీఎం జగన్ చేసిన విమర్శలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. జగన్ పై ఎమ్మెల్యేలు, మంత్రులు మాటలతో ఎదురుదాడి చేస్తున్నారు. అయితే జగన్ విమర్శలపై పవన్ ఇంతవరకు స్పందించకపోయినా, మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ మాత్రం తగ్గేదేలే అంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. తమ నేతను విమర్శిస్తున్న జగన్ కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలిపోటుకు తక్కువ అంటూ మంత్రి నాదెండ్ల సెటైర్లు పేల్చారు. తమ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి వచ్చిన సీట్లు, పిఠాపురంలో వచ్చిన మెజార్టీ కూడా తెచ్చుకోలేని జగన్ మాట్లాడేముందు తన అర్హత చూసుకోవాలని మంత్రి నారా లోకేశ్ నిలదీశారు.
ముఖ్యంగా జగన్ ప్రాసలోనే మంత్రి నాదెండ్ల కౌంటర్ ఇవ్వడం ఆకట్టుకుంటోందని అంటున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్ కోడికత్తి డ్రామా ఆడటంతోపాటు సొంత బాబాయ్ హత్యను రాజకీయంగా వాడుకున్నారని గుర్తు చేస్తూ నాదెండ్ల విమర్శలు చేయడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయిందని అంటున్నారు. జగన్ నేరపూరిత మనస్తత్వం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ఫలితం అనుభవించారని గుర్తుంచుకోవాలన్నారు. ఒకరిని అగౌరవపరచడం వల్ల ఓట్లు వస్తాయని ఇప్పటికి జగన్ భ్రమలో బతుకుతున్నారని నాదెండ్ల విమర్శలు గుప్పించారు.
ఎవరైనా ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత తమ సొంత నియోజకవర్గానికి వెళతారని, తాను సాధించినవి చెప్పుకుంటారన్న నాదెండ్ల, ప్రతిపక్ష నేత జగన్ మాత్రం బెంగళూరు నుంచి రాష్ట్రానికి వచ్చి మళ్లీ బెంగళూరు వెళ్లిపోతున్నారని అన్నారు. అసెంబ్లీకి రాకుండా మీడియా ముందు మాట్లాడితే ఏం ప్రయోజనమని నిలదీశారు. జగన్ తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి రావాలని సూచించారు.