ఇక, జనసేన డైరీ.. ఓపెన్.. !
ఇప్పటి వరకు రాష్ట్రంలో `రెడ్ బుక్` పాలన నడుస్తోందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
By: Tupaki Desk | 18 Feb 2025 7:51 AM GMTఇప్పటి వరకు రాష్ట్రంలో `రెడ్ బుక్` పాలన నడుస్తోందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గగ్గోలు కూడా పెడుతున్నారు. అరెస్టులు, కేసులు.. జైళ్లు.. బెయిళ్లతో వైసీపీ నాయకులు తీరికలేకుండా ఉన్నారు. తరచుగా రెడ్ బుక్‌పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో తాజాగా జనసేన కూడా డైరీ ఓపెన్ చేసేందుకు రెడీ అయింది.
జనసేన నాయకులను వేధించిన వైసీపీవారిపై చర్యలు తీసుకునే సమయం వచ్చిందని తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దీంతో ఇక, రెడ్ బుక్‌తో పాటు జనసేన డైరీ ఓపెన్ అవుతుందన్న చర్చకు అవకాశం వచ్చింది. తాజాగా గుంటూరులో మాట్లాడిన నాదెండ్ల.. వైసీపీ హయాంలో తమ పార్టీ నాయకులను వేధించిన వారిని వదిలి పెట్టేది లేదన్నారు. వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తామని చెప్పారు.
దీంతో ఇప్పుడు జనసేన నాయకులు తమను వేధించిన వారి వివరాలను వెలికి తీస్తున్నారు. నిజానికి గతంలో వైసీపీ నాయకులు, జనసేన నాయకులు కూడా కలిసి పని చేసుకున్నారనే వాదన ఉంది. టీడీపీ ని మాత్రమే వైసీపీ ప్రధాన ప్రత్యర్థిగా భావించింది. దీంతో ఆ పార్టీనాయకులపైనే ఎక్కువగా వేధింపులు.. కేసులు నమోదయ్యాయనేది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన విషయంలో కేవలం పవన్‌ను మాత్రమే వైసీపీ టార్గెట్ చేసింది.
ఈ క్రమంలోనే పవన్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి. కాకినాడలో వలంటీర్లను దూషించి.. వారిపై లేనిపోని ఆరోపణలు చేశారన్న కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఇక, ట్రాఫిక్‌కు అడ్డం కలిగించారని విశాఖలో కేసు ఉంది. మంగళగిరిలోనూ ఇదే తరహా కేసు నమోదు చేశారు. ఇతర నేతలపై పెద్దగా కేసులు పెట్టలేదు. అయినప్పటికీ.. నాదెండ్ల హెచ్చరికల నేపథ్యంలో జనసేన డైరీ ఓపెన్ చేస్తే.. ఏం జరుగుతుందోనన్న చర్చ అయితే.. సాగుతుండడం గమనార్హం.