నాదెండ్ల మనోహర్ 10 కోట్ల స్పోర్ట్స్ కార్ సహా ఆస్తులు కూడగట్టాడు!
జనసేన నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయరని.. ఈ బాధ్యతలు కూడా టీడీపీ అధినేత చంద్రబాబే చేస్తారని చెప్పారు
By: Tupaki Desk | 21 April 2024 5:46 AM GMTజనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌పై ఆ పార్టీ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత పోతిన మహేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రూ.10 కోట్ల విలువైన స్పోర్ట్స్ కారును మనోహర్ తన బినామీతో కొనుగోలు చేయించారని తెలిపారు. దీనిని హైదరాబాద్‌లోని ఓ పార్కింగ్ స్థలంలో ఉంచుతున్నారని చెప్పారు. ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో. మనోహర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు. జనసేన నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయరని.. ఈ బాధ్యతలు కూడా టీడీపీ అధినేత చంద్రబాబే చేస్తారని చెప్పారు.
ప్రతి రోజూ జనసేన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వస్తున్నారని, అది కూడా టీడీపీ ఆఫీస్ నుంచేన ని పోతిన సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు, పోలింగ్‌కు ముందే.. జనసేనను టీడీపీలో విలీనం చేసేశారా? అని వ్యంగ్యా స్త్రాలు రువ్వారు. ఎన్నికలు అయిన తర్వాత.. ఏదో ఒక రోజు టీడీపీలో జనసేన విలీనం ఖాయమని మరోసారి నొక్కి చెప్పారు. దానికి ఇప్పుడు జరుగుతున్నది సంకేతమా? అని ప్రశ్నించారు. దీనిపై పవన్ కల్యాణే క్లారిటీ ఇవ్వాలని పోతిన సూచించారు. తాను లేవనెత్తిన అన్ని అంశాలపైనా పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వాలన్నారు.
అంతేకాదు..కులాన్ని కూడా టీడీపీకి తాకట్టుపెట్టారని పోతిన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు యువతను నమ్మించి గొంతు కోస్తున్నారని పవన్‌పై నిప్పులు చెరిగారు. పార్టీని డెవలప్ చేయడంపై దృష్టి పెట్టడం ఎలా ఉన్నా.. నిరంతరాయంగా డబ్బులు సంపాయించుకునేందుకు నాదెండ్ల తెగ కష్టపడుతున్నారని పోతిన దుయ్యబట్టారు. ``ఇద్దరు కూర్చునే ఖరీదైన స్పోర్ట్స్ కారును బినామీతో కొనిపించారు. దీని ఖరీదు అక్షరాలా పది కోట్లు. దీనిని ఎక్కడ పెడుతున్నారో కూడా ఆధారాలతో సహా ఉన్నాయి. దీనికి మనోహర్ సమాధానం చెప్పాలి`` అని పోతిన సవాల్ రువ్వారు. ఈ కారునుకొనుగోలు చేయడం వెనుక ఏ సినీ నిర్మాత ఉన్నాడో బహిర్గతం చేయాలని అన్నారు.
తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్.. అక్కడి ఓటర్లకు ఓటుకు రూ.10 వేల చొప్పున ఇచ్చినా ఇస్తాడని పోతిన మహేష్ అన్నారు. అయితే..మనోహర్ ఇచ్చిన డబ్బులు తీసుకోవాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. అయితే.. ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు వేసి వైసీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. అదే మనోహర్‌కు సరైన ట్రీట్‌మెంట్ అన్నారు.