బిగ్ షాట్స్ నే టార్గెట్ చేసిన నాదెండ్ల !
రేషన్ బియ్యం అన్నది అక్రమంగా రవాణా అవుతోంది. ఇది అందరికీ తెలిసిందే. రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యాన్ని ఎవరూ తీసుకోవడం లేదు
By: Tupaki Desk | 13 Aug 2024 12:25 PM GMTరేషన్ బియ్యం అన్నది అక్రమంగా రవాణా అవుతోంది. ఇది అందరికీ తెలిసిందే. రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యాన్ని ఎవరూ తీసుకోవడం లేదు. దానికి అయిన కాడికి అమ్ముకుంటున్నారు. ఆ తరువాత ఆ బియ్యాన్ని డీలర్లు మిల్లర్లకు అమ్ముతారు. అలా అక్కడ నుంచి ఒక రింగ్ గా ఏర్పడి బడా వ్యక్తులే ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారని ఈ బియ్యం అంతా దేశాలు దాటిపోతోందని ఆరోపణలు ఉన్నాయి.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ బియ్యం అక్రమ రవాణా మీద ఫుల్ ఫొకస్ పెట్టింది. ఈ బియ్యం అక్రమ రవాణాలో బిగ్ షాట్స్ ఉన్నారని కూడా కూటమి సర్కార్ భావిస్తోంది. ఈ నేపధ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక బాంబు పేల్చారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణా కాకినాడ పోర్టు ద్వారానే జరిగింది అని ఆయన నిర్ధారించారు. దీనికి సంబంధించిన వ్యవహారంలో త్వరలోనే అరెస్టులు ఉంటాయని హింట్ ఇచ్చెశారు. నాదెండ్ల కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలే చెశారు.
కాకినాడ పోర్టు వద్ద జరిగిన రెషన్ బియ్యం అక్రమాలపైన లోతైన విచారణ సాగుతోందని అన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకి అడ్డుకట్ట వేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకే కాకినాడ పోర్టులో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. కాకినాడ యాంకరేజీ పోర్టును దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు.
అంతే కాదు కేవలం ఒక కుటుంబం కోసం కాకినాడ పోర్టు లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మంట పుట్టిస్తున్నాయి. కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని నాదెండ్ల అన్నారు.
ఏపీలో గత ఐదేళ్లుగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగిందని దానికి ఏకంగా కాకినాడ పోర్టు అడ్డాగా మారిందని నాదెండ్ల ఆరోపణలు చేశారు. ఆహార భద్రత చట్టం కింద రాష్ట్రవ్యాప్తంగా కోటీ 47 లక్షల రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా బియ్యం సరఫరా చేస్తుంటే ఆ బియ్యాన్ని 10 రూపాయిల లోపు ధరకు వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి బ్రోకెన్ రైస్, బాయిల్ రైస్ పేరిట ఇతర దేశాలకు ఎగుమతి చేసి పెద్ద ఎత్తున అమ్ముకుంటున్నారని నాదెండ్ల అసలు గుట్టు బయట పెట్టారు.
కాకినాడ పోర్టులో జూన్ 28, 29 తేదీల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేస్తే అందులో 26 వేల మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యంగా అధికారులు నిర్ధారించారని మంత్రి చెప్పారు. ఈ మొత్తం ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ పూర్తికావచ్చిందని బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని భారీ అరెస్టులు ఉంటాయని స్పష్టం చెశారు. అలాగే అక్రమాలకు కారకులైన వారికి 41ఏ నోటీసులు జారీ చేస్తామనివిచారణ పూర్తయ్యాక అరెస్టులు తప్పకండా ఉంటాయని అన్నారు.
నాదెండ్ల మాటలను బట్టి చూస్తూంటే తొందరలో పెద్ద ఎత్తున అరెస్టులు ఖాయమని తేలుతోంది. మరి ఆ బిగ్ షాట్స్ ఎవరు అన్నది తేలాల్సి ఉంది. ఇతర దేశాలకు ఇంత పెద్ద ఎత్తున బియ్యం రవాణా అక్రమంగా చేయడం అంటే మాటలు కాదు, దానికి ఎంతో పలుకుబడి కలిగి ఉండాలి. గత అయిదేళ్ళుగ విచ్చలవిడిగా కాకినాడ పోర్టు అక్రమ బియ్యం రవాణాతో మోత మోగిందని కూటమి పెద్దలు చెబుతున్న దానిని బట్టి చూస్తే అరెస్టులు సంచలం రేకెత్తించలాగానే ఉంటాయని అంటున్నారు.