సనాతన ధర్మంపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 Sep 2024 9:05 AM GMTప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనెలు కలిశాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సిట్ విచారణకు కూడా ఆదేశించింది.
మరోవైపు డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడలో కనకదుర్గమ్మ గుడి మెట్లను కడిగి ఆయన పసుపు కుంకుమ పూశారు. తక్కువ ధరకు వచ్చే నెయ్యిని వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. ఆ ప్రభుత్వ హయాంలో తిరుమలలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని పవన్ ఆరోపించారు.
అంతేకాకుండా లడ్డూ వ్యవహారంలో వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్, ప్రముఖ తమిళ నటుడు కార్తీలపై పవన్ పదునైన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అన్నయ్య, జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో నాగబాబు సుదీర్ఘంగా పోస్టు చేశారు. ఇందులో సనాతన ధర్మంపై పవన్ వైఖరి ఏమిటో నాగబాబు తేటతెల్లం చేశారు.
‘‘నీ మతంతో పాటు సాటి మతాలని గౌరవించు, రక్షించు అని సమానత్వాన్ని చాటిందే సనాతన ధర్మం. ఆ ధర్మాన్నే పాటిస్తాడు పవన్ కళ్యాణ్
ఎన్నో మీటింగ్స్ ఉధృత స్థాయిలో జరుగుతున్నపుడు మసీదు నుంచి అజాన్ వస్తే తన స్పీచ్ ని అజాన్ పూర్తయే దాక ఆపేసి నిశ్శబ్దం పాటిస్తాడు.. పవన్ కళ్యాణ్. అది పర మతానికి అతనిచ్చే గౌరవం, మర్యాద’’ అని నాగబాబు తన పోస్టులో తెలిపారు.
‘‘ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని హిందువులు మాత్రమే కాదు, క్రై స్తవులు, ముస్లింలు కూడ ప్రేమిస్తారు.. అతను మతఛాందస వాది కాదు హిందు మతాన్ని గౌరవించాలి, హిందు ఆచారాలని రక్షించాలని పాటుపడేవాడు’’ అని నాగబాబు తన పోస్టులో పవన్ గురించి వెల్లడించారు.
‘‘హిందు మత ధర్మ పరిరక్షణలో పవన్ కళ్యాణ్ పోరాటం క్రై స్తవుల మీద, ముస్లింల మీద కాదు. హిందు ధర్మంలో ఉంటు హిందు ధర్మాన్ని చులకన చేస్తూ సెక్యులర్ వాదులం అని చెప్పుకునే సూడో సెక్యులర్ వాదులను చెంపపెట్టి కొట్టడానికి’’ అని నాగబాబు తెలిపారు.
‘‘ హిందు మతం పట్ల ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్న కొంతమందిని తిరిగి ‘గౌరవించరా నీ సనాతన ధర్మాన్ని’ అని చెప్పే నాయకుడు పవన్ కళ్యాణ్’’ అని నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
‘‘ పవన్ పరిపాలనలో ప్రతి మతం ప్రశాంతంగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాటలు సూడో సెక్యులర్ వాదులకి తప్ప ఏ క్రిస్టియన్ కు, ఏ ముస్లింకు బాధ కలిగించవు.. అర్ధం చేస్కోగలరు’’ అంటూ నాగబాబు.. పవన్ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు.