కుంభమేళాలో తొలి స్నానం చేసేదెవరో తెలుసా?
ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో జరిగే ఈ మహా కుంభమేళాలో తొలి స్నానం ఎవరు చేస్తారనేది ఆసక్తికరం.
By: Tupaki Desk | 7 Jan 2025 6:30 PM GMTప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాకు ఎంతో విశిష్ఠత ఉంది. ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కుంభమేళాలో స్నానమాచరించాలని హిందూ ధర్మం చెబుతుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కుంభమేళా ఈ నెల 13న మొదలవుతుంది. వచ్చేనెల 26తో ముగుస్తుంది. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో జరిగే ఈ మహా కుంభమేళాలో తొలి స్నానం ఎవరు చేస్తారనేది ఆసక్తికరం.
సాధారణంగా ప్రభుత్వ పరమైన ఏ వేడుకలు ప్రారంభమైనా ప్రభుత్వాధినేతలు ప్రారంభించడం ఆనవాయితీ. ప్రతి ఏటా నిర్వహించే పుష్కరాలను ఆయా ప్రాంతాల్లో సీఎంలు ప్రారంభించడం, వారే తొలి స్నానం చేయడం ఒక పద్ధతిగా వస్తోంది. ఇదే సమయంలో హిందూ ఆలయాల్లో వేడుకలు నిర్వహిస్తే ఆయా ఆలయాల ధర్మకర్తలు తొలి పూజ చేసే అవకాశం దక్కించుకుంటారు. కానీ, కుంభమేళాలో ఇలా అధికారిక పదవులు ఉన్నవారు ఎవరూ తొలి స్నానం చేసేందుకు అర్హులు కారు. ఈ మహా కుంభమేళా ప్రారంభ సూచికగా నాగసాధువులు తొలి స్నానం చేస్తేనే వేడుక మొదలైనట్లు.
ప్రయాగ్ రాజ్లో జరిగే కుంభమేళా వేడుకలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుమారు రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తుంది. కేంద్రం కూడా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది. అయినప్పటికీ ప్రధాని, సీఎం వంటివారు ప్రారంభ కార్యక్రమంలో నామమాత్రంగానే చెబుతున్నారు. హిమాలయాల నుంచి వచ్చే నాగసాధువులు తొలి స్నానంగా చెప్పే రాజ్యస్నానం చేస్తేనే అధికారికంగా మహా కుంభమేళా ప్రారంభమవుతుందని చెబుతున్నారు.
నాగసాధువులను మహాయోధ సాధువులుగా పిలుస్తారు. పురాతన కాలం నుంచి హిందూ మతానికి రక్షకులుగా నిలిచిన నాగసాధువులు దేవుడి సైన్యంగా చెబుతుంటారు. అందుకే నాగసాధువులు స్నానమాచరించాకనే మిగిలిన యాత్రికులకు అనుమతిస్తారు.