Begin typing your search above and press return to search.

నాగబాబు దృష్టిలో చంద్రబాబు అంటే... వీడియో హల్ చల్!

అవును... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఉప ముఖ్యమంత్రి సోదరుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   20 Oct 2024 5:31 AM GMT
నాగబాబు దృష్టిలో చంద్రబాబు అంటే...  వీడియో హల్  చల్!
X

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై.. సినీనటుడు, నిర్మాత, జనసేన పార్టీలో కీలక నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అంటూ ప్రశంసల జల్లులు కురిపించారు. కూటమిలో భాగమైన జనసేన నాయకుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అవును... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఉప ముఖ్యమంత్రి సోదరుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదని, రాజనీతిజ్ఞుడని నాగబాబు కొనియాడారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అమరావతి విషయంలో చంద్రబాబు చాలా ఊహించుకున్నారని తెలిపారు.

అయితే... వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విజన్ ని సర్వనాశనం చేశారని ఫైరయ్యారు. ఇక చంద్రబాబుకు ఉన్న ఓర్పు ఎవరికీ లేదని చెప్పుకొచ్చారు. సైబరాబద్ ఆర్కిటెక్ట్ గా, హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి చంద్రబాబు అని నాగబాబు ఈ సందర్భంగా కొనియాడారు.

ఇదే సమయంలో టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన సందర్భాన్ని కూడా నాగబాబు ప్రస్థావించారు. ఇందులో భాగంగా... అప్పటి వాస్తవాలు, పరిస్థితులు తెలుసుకోకుండా చంద్రబాబుపై నిందలు వేయడం సులభమని అన్నారు. అప్పుడు నిజంగా ఏమి జరిగిందనేది ఎవరికీ సరిగ్గా తెలియదని తెలిపారు!

ఈ సందర్భంగా నిజానికి మూడు పార్శ్వాలుంటాయని చెప్పిన నాగబాబు... అందులో ఒకటి నీ అభిప్రాయం.. ఒకటి నా అభిప్రాయం.. మరొకటి అసలైన వాస్తవం అని చెప్పుకొచ్చారు. ఈ సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని అన్నారు. నాడు ఎన్టీఆర్ ని అభిమానించే ఎంతోమంది వ్యతిరేకిస్తున్నప్పటినీ సీఎంగా నిలబడిన ధీరుడని నాగబాబు కొనియాడారు!

కాగా... 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుపై నాగబాబు నిప్పులు కక్కిన సంగతి తెలిసిందే. పాలు మరగడానికి నాలుగున్నర నిమిషాలు పడుతుంది కానీ.. చంద్రబాబు రక్తం మరగడానికి నాలుగున్నరేళ్లు పడుతుందంటూ ఆయన చేసిన వెటకారానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి.

అయితే 2024 సార్వత్రిక ఎన్నికలు కొంతకాలం ముందు నుంచి చంద్రబాబుపై నాగబాబు అభిప్రాయం మారినట్లు కనిపించింది. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పూర్తిగా మారినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే... బాబు విజన్ గురించి, గొప్పతనం గురించి, రాజనీతిజ్ఞత గురించి నాగాబాబు ప్రశంసలు కురిపించారు.