Begin typing your search above and press return to search.

నాగబాబు అనే నేను...కొద్ది రోజులు ఆగాల్సిందే ?

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఎంత దూరంలో ఉంది అంటే దానికి జవాబు ఠక్కున చెప్పడం కష్టమే.

By:  Tupaki Desk   |   17 Dec 2024 12:30 PM GMT
నాగబాబు అనే నేను...కొద్ది రోజులు ఆగాల్సిందే ?
X

మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఎంత దూరంలో ఉంది అంటే దానికి జవాబు ఠక్కున చెప్పడం కష్టమే. ఎందుకంటే సొంత తమ్ముడు ఏపీలో కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాతో రాజ్యం చేస్తున్నారు. ఆయన మాటకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కువ విలువ ఇస్తున్నారు. అందువల్ల పవన్ ఈ రోజు కోరుకుంటే ఈ రోజే నాగబాబు మంత్రి అవుతారు.

అయితే ఇక్కడ పవన్ కోరుకోవాలీ అంటే దానికీ లెక్కలు ఉన్నాయి. పైగా ఏది చేసినా మాకు అవకాశం అధికారం ఉంది కదా అని చేసేందుకు పవన్ ఇష్టపడరు, ఆయనతో పాటు చంద్రబాబు కూడా అలాగే ఆలోచిస్తారు. ఏ డెసిషన్ ని ఎపుడూ నూరు శాతం జనాలూ మెచ్చరు. కానీ మెజారిటీ జనాలు మెచ్చాలీ అన్నా కొన్ని విధాలను ఉంటాయి.

అందుకే నాగబాబు అను నేను మంత్రిగా అన్న మాటకు కొంత టైం పట్టవచ్చు అన్నది ప్రచారంలో ఉన్న మాట. ఎందుకు అంటే ఇపుడేమీ అర్జంటు వ్యవహారం అయితే ఇది కాదు. నాగబాబుని రాజ్యసభ సీటులోకి తీసుకుని పార్లమెంట్ కి పంపాలని అనుకున్నారు. ఆ ఎన్నికల క్రతువు పూర్తి అయింది. అక్కడ నాగబాబుకు చాన్స్ రాలేదు. దాంతో ఆయనను మంత్రివర్గంలో అకామిడేట్ చేస్తామని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.

అంటే నాగబాబుకు అన్యాయం జరగలేదు అని చెప్పడానికి మాత్రమే ఆ ప్రకటన. ఇక ఎపుడు మంత్రిగా తీసుకుంటారు అన్నది అన్ని విషయాలూ గమనంలోకి తీసుకుని చేస్తారు అని అంటున్నారు. ఎందుకు అంటే నాగబాబు ఈ రోజుకు చట్ట సభలో దేనిలోనూ మెంబర్ కాదు. ఆయన ఎమ్మెల్సీ కావాలంటే కనీసం మూడు నాలుగు నెలల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది.

అందుకే కొంత టైం అని అంటున్నారు. అలా కాకుండా ముందుగా మంత్రిని చేసి ఆరు నెలల వ్యవధిలో ఎమ్మెల్సీగా చేయవచ్చు. ఇది రెండవ మార్గం. దీనిని సహజంగా అత్యవసర సందర్భాలలోనే వాడుతారు. ఇపుడు అలాంటి సందర్భం ఏదీ లేదని కూటమి పెద్దల భావనగా ఉంది అని అంటున్నారు. పైగా కూటమిలో మూడు పార్టీలు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అత్యధిక శాతం మంత్రి పదవుల విషయంలో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.

వీరితో పాటు ఎమ్మెల్సీలుగా నెగ్గిన వారు ఇంకా చాన్స్ దక్కించుకోబోయేవారు అంతా కూడా మంత్రి సీటు మీదనే కన్ను వేసి ఉన్నారు. ఈ క్రమంలో నాగబాబుని ఎమ్మెల్సీ చేయకుండానే మంత్రి పదవికి తీసుకుంటే కొంత అసంతృప్తి రావచ్చు అన్నది కూడా ఉంది అంటున్నారు. కూటమిలో బీజేపీ అయితే తమకు ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చారన్న ఆవేదనతో ఉంది అని అంటున్నారు.

మరో వైపు జనసేనకు పెద్ద పీట వేస్తున్నారు అన్న భావన కూడా కూటమిలో కలగకూడదు అని కూడా ఆలోచిస్తున్నారు. దాంతో సంప్రదాయం ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అంటే మొదట చట్ట సభలో నాగబాబుని తీసుకుని రావడం ఆ మీదట ఒక మంచి ముహూర్తం చూసుకుని మంత్రి పదవిని ఇవ్వడం చేస్తారు అని అంటున్నారు.

ఏపీలో చూస్తే శాసనమండలిలో నాలుగైదు ఎమ్మెల్సీ పదవులు మార్చి 30 తరువాత ఖాళీ అవుతాయి. అందులో ఒక దానిని నాగబాబుకు ఇస్తారు అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే ఆయన ఏప్రిల్ లో ఎమ్మెల్సీ అయితే అదే నెలలో కొత్త తెలుగు సంవత్సరం ఉగాది వేళ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.

ఆ విధంగా నాగబాబుని ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేసే సంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం అనుసరిస్తుంది అని అంటున్నరు. నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖను ఇస్తారు అని అంటున్నారు. అలా నాగబాబు మంత్రి పదవికి మరిన్ని నెలలు సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో.