నాగబాబు లేపిన దుమారం.. వర్మ సీరియస్!
జనసేన జయకేతనం సభలో చలరేగిన రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. ముఖ్యంగా కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన జనసేన ప్రధాన కార్యదర్శి, జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన కామెంట్స్ పై రచ్చ ఇంకా కొనసాగుతోంది.
By: Tupaki Desk | 17 March 2025 12:49 AM ISTజనసేన జయకేతనం సభలో చలరేగిన రాజకీయ వేడి ఇంకా చల్లారలేదు. ముఖ్యంగా కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన జనసేన ప్రధాన కార్యదర్శి, జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన కామెంట్స్ పై రచ్చ ఇంకా కొనసాగుతోంది. పిఠాపురంలో పవన్ గెలుపులో ఎవరి పాత్ర లేదని, ఎవరైనా పవన్ ను తామే గెలిపించామని అనుకుంటే అది వారి ‘కర్మ’ అంటూ నాగబాబు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. నాగబాబు ఈ కామెంట్స్ పై రెండు రోజులుగా టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే పిఠాపురంలో పవన్ గెలుపునకు కీలకంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ తొలిసారిగా నాగబాబు వ్యాఖ్యలపై స్పందించారు.
పిఠాపురంలో పవన్ గెలుపునకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఎంతో కష్టపడి పనిచేశారని, ఆయన సేవలను మరచిపోలేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలోనే ప్రకటించారు. అయితే నామినేటెడ్ పోస్టుల పందేరంలో వర్మకు తొలి ప్రాధాన్యమిస్తారని అంతా భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సైతం వర్మకు అవకాశం ఇవ్వడంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా, వర్మకు ఎలాంటి పదవి దక్కలేదు. రకరకాల సామాజిక, సాంకేతిక కారణాలతో వర్మకు పదవి వచ్చినట్లే వచ్చి చేజారిపోతోంది. తాజాగా 5 ఎమ్మెల్సీలకు జరిగిన ఎన్నికల్లో వర్మ సీటును నాగబాబు తన్నుకుపోయారని టాక్ నడుస్తోంది.
పుండు మీద కారం జల్లినట్లు వర్మకు పదవి దక్కలేదని ఆవేదనలో టీడీపీ క్యాడర్ ఉండగా, జనసేన ఆవిర్భావ సభలో వర్మను ఉద్దేశిస్తూ నాగబాబు పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం మరింత మంట పుట్టించింది. దీనిపై నాగబాబుపై టీడీపీ సోషల్ మీడియా ఫైర్ అవుతోంది. అంతేకాకుండా నాగబాబు వ్యాఖ్యలు సబబు కాదంటూ వర్మపై సానుభూతి వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు రోజులుగా పరిస్థితులను గమనిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఆదివారం తొలిసారిగా పెదవి విప్పారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో తన పాత్రపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఎక్కడా నాగబాబు పేరు ప్రస్తావించకపోయినా, ఆయన చేసిన కామెంట్స్ జనసేనను తాకేలా ఉన్నాయని అంటున్నారు.
‘‘నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సైన్యంలో ఒక సైనికుడిని. నా నాయకుడి మార్గదర్శకత్వంలో నడుచుకుంటాను. ఎవరైనా వచ్చి పిఠాపురంలో నా ప్రభావం తగ్గిందని చెబితే, నేను వారికి ఏ సమాధానం ఇవ్వను. నేను పదవిలో ఉండవచ్చు లేకపోవచ్చు, కానీ నా పిఠాపురం ప్రజలకు ఎల్లప్పుడూ విధేయుడిగా ఉంటాను. ఎవరూ నన్ను భయపెట్టలేరు. ఇతరులు చేసే వ్యాఖ్యలకు నేను బాధపడను’’ అంటూ వర్మ కౌంటర్ ఇచ్చారు. వర్మ ప్రకటనలో ఎక్కడా జనసేన లేదా ఆ పార్టీ నేతల పేర్లు ప్రస్తావించకపోయినా ‘నాగబాబు కర్మ వ్యాఖ్యలు’కు ప్రతిస్పందనగానే అంతా చూస్తున్నారు. పిఠాపురంలో క్షేత్రస్థాయిలో మంచి పట్టున్న నేతగా వర్మకు గుర్తింపు ఉంది. గతంలో ఓ సారి ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర కూడా వర్మకు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో అధినేత చంద్రబాబుకు ఇచ్చిన మాట ప్రకారం పవన్ కల్యాణ్ గెలుపు కోసం వర్మ ఎంతో కష్టపడి పనిచేస్తే ఇప్పుడు ఆయనను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.