Begin typing your search above and press return to search.

కాంట్రావర్సీ.. మెగా బ్రదర్‌ నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల నూనెలు కలిపారంటూ వస్తున్న ఆరోపణలపై జనసేన పార్టీ ముఖ్య నేత, మెగా బ్రదర్‌ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   21 Sep 2024 10:06 AM GMT
కాంట్రావర్సీ.. మెగా బ్రదర్‌ నాగబాబు సంచలన వ్యాఖ్యలు!
X

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ వ్యవహారంలో జంతువుల కొవ్వులు కలిపారనే వార్త దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల నూనెలు కలిపారంటూ వస్తున్న ఆరోపణలపై జనసేన పార్టీ ముఖ్య నేత, మెగా బ్రదర్‌ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో, చేప నూనెతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరమన్నారు.

ఈ మేరకు నాగబాబు సోషల్‌ మీడియా మాధ్యమం ఎక్స్‌ లో సుదీర్ఘ పోస్టు పెట్టారు.

''ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'తిరుమల తిరుపతి దేవస్థానం' ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనెతో కల్తీ చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం'' అని నాగబాబు దుయ్యబట్టారు.

''పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు కాని కోట్ల మంది హిందువుల గోడు కూడగట్టుకున్నారు అని గుర్తించలేకపోయారు'' అని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

''ఒక వ్యక్తి ఒక మతాన్ని స్వీకరించి.. ఆ దేవున్ని నిష్టతో పూజించి ఆ దేవుడికి ప్రసాదం అర్పించడం జరుగుతుంది. తదుపరి ఆ ప్రసాదాన్ని భుజిస్తే ఆ దేవుడే వారితో మమేకమైనట్టు నమ్ముతారు'' అని నాగబాబు గుర్తు చేశారు.

''అంతటి విశిష్టతమైన ప్రసాదాన్ని.. అందులోనూ తిరుమల వంటి ప్రపంచ ప్రఖ్యాత గల పుణ్యక్షేత్రంలోని లడ్డు ప్రసాదాన్ని నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో జంతు కొవ్వు సైతం వెయ్యడానికి వెనకాడని ఇలాంటి ద్రోహుల్ని క్షమించకూడదు'' అని నాగబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

''అందుకే టీటీడీ లాంటి శాఖలలో హిందుత్వాన్ని ఆచరించే వారుంటేనే ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు పునరావృతం అవ్వవని నమ్ముతూ ఈ హేయమైన చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను'' అని నాగబాబు ఎక్స్‌ లో పోస్టు చేశారు.

ఈ నేపథ్యంలో నాగబాబు వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్‌ పదవికి నాగబాబు పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రచారాన్ని ఆయన ఖండించారు.