Begin typing your search above and press return to search.

మంత్రిగా నాగబాబు...తమ్ముళ్ళకు ఓకేనా ?

మెగా బ్రదర్ గా ఉన్న నాగబాబుకు రాజకీయ సిరి పట్టబోతోంది. ఆయన జాతకం అటూ ఇటూ తిరిగి ఏకంగా మినిస్టర్ కుర్చీలో కూర్చోమంటోంది.

By:  Tupaki Desk   |   10 Dec 2024 10:30 PM GMT
మంత్రిగా నాగబాబు...తమ్ముళ్ళకు ఓకేనా ?
X

మెగా బ్రదర్ గా ఉన్న నాగబాబుకు రాజకీయ సిరి పట్టబోతోంది. ఆయన జాతకం అటూ ఇటూ తిరిగి ఏకంగా మినిస్టర్ కుర్చీలో కూర్చోమంటోంది. కలిసొచ్చే కాలానికి నడిచొస్తున్న మంత్రి పదవితో నాగబాబు పొలిటికల్ కెరీర్ కొత్త పుంతలు తొక్కనుంది.

ఇవన్నీ సరే కానీ నాగబాబుకు మంత్రి పదవి అంటే టీడీపీ తమ్ముళ్లకు ఓకేనా అన్న చర్చ సాగుతోంది.ఎందుకంటే టీడీపీలో చాలా మంది పదవుల విషయంలో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఉన్నది ఒకే ఒక కేబినెట్ బెర్త్ కానీ దానిని చూస్తూ ఆశలు పెంచుకున్న వారు అనేకమంది.

టీడీపీలో సీనియర్లకు కొదవ లేదు. వారంతా తమకు మినిస్టర్ పోస్టు దక్కుతుందా అన్నది చూస్తూ వస్తున్నారు. అయితే బిగ్ ట్విస్ట్ గా ఆ ఒకే ఒక పోస్టు చివరికి నాగబాబుకు అంకితం అయింది. దాంతో సీనియర్ నేతలు లోలోపల ఎలా అనుకుంటున్నారో తెలియదు కానీ టీడీపీలో తమ్ముళ్లు మాత్రం కొంతమంది నాగబాబు విషయంలో గుస్సా అవుతున్నారు అని అంటున్నారు.

టీడీపీ నేతలు ఒక వైపు ఆగ్రహంగా ఉంటే నాగబాబు మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అయితే వస్తున్నాయని అంటున్నారు. నాగబాబుని మంత్రిమండలిలో తీసుకుంటున్నట్లుగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో టీడీపీలో ఒక విధమైన చర్చ అయితే సాగుతోంది.

ఈ విధంగా ప్రకటించినందుకు చంద్రబాబు మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారని అంటున్నారు. ఇదే నాగబాబు గతంలో చంద్రబాబు మీద బాలక్రిష్ణ మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతిని గుర్తు చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

నాగబాబు ఆ విధంగా 2019 ఎన్నికల ముందు టీడీపీ వారి మీద తీవ్ర విమర్శలు చేశారని గుర్తు చేస్తున్నారు. బాలయ్య ఎవరో తెలియదు అని కూడా అన్నారని వారు పాతవి కెలుకుతున్నారు. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం పట్ల టీడీపీలో అయితే అంతర్లీనంగా అగ్గి రాజుకుంటోంది అని అంటున్నారు. మరి దీని మీద కూటమిలో ఏ విధమైన రియాక్షన్ ఉంటుందో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం నాగబాబుకే ఆ ఏకైక కేబినెట్ బెర్త్ అంటూ ప్రకటించేశారు.

మంచి ముహూర్తం చూసుకుని నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒక్కటే తరువాయి అని అంటున్నారు. మరి టీడీపీలో పదవుల మీద ఆశలు పెట్టుకుని నిరాశకు లోను అయిన సీనియర్ నేతలు కానీ ఇతర నాయకులు కానీ ఎలా సర్దుకుని పోతారో చూడాల్సి ఉంది.