నాగబాబు మంత్రి పదవికి బ్రేకులేస్తోంది ఎవరు ?
అంటే రాజ్యాంగం ప్రకారం ఆయన ఉభయ సభలలో ఒకదానిలో సభ్యుడు అయినట్లే. దాంతో ఆయనకు కేబినెట్ బెర్త్ కేటాయించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు.
By: Tupaki Desk | 18 March 2025 7:00 AM ISTమెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మంత్రి అవుతారని ప్రచారం పెద్ద ఎత్తున సాగిన తరువాత అందులో మొదటి ఘట్టం అయిన ఎమ్మెల్సీ పదవిని ఆయన అందుతున్నారు. అంటే రాజ్యాంగం ప్రకారం ఆయన ఉభయ సభలలో ఒకదానిలో సభ్యుడు అయినట్లే. దాంతో ఆయనకు కేబినెట్ బెర్త్ కేటాయించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు.
ఇక ఆయనకు మంత్రి పదవీ ఆఫర్ చేసిందే టీడీపీ అధినాయకత్వం కాబట్టి చాలా సులువుగా సజావుగా ఈ ప్రక్రియ సాగిపోవాల్సి ఉంది. కానీ నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందా దక్కితే ఎపుడు దక్కుతుంది. అది ఉగాది నాటికి అవుతుందా లేక జూన్ దాకా వాయిదా పడుతుందా ఒకవేళ అపుడు కూడా బ్రేకులు ఏమైనా పడతాయా అన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో విస్తృతంగా సాగుతోంది.
అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే చాలానే ఉన్నాయి. నాగబాబుని మంత్రిగా కాకుండా అడ్డుకుంటున్నది ఎవరు అంటే జవాబు కూడా చిత్రంగా వినవస్తోంది. ఎవరో కాదు నాగబాబే అని. అవును ఆయన పదవికి ఆయనే అడ్డుగా మారారని అంటున్నారు. నాగబాబు బోల్డ్ టైప్. ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తారు.
ఆయన రాజకీయాల గురించి ఆలోచించరు. ఒక మాట వెనక ఏమి జరుగుతుంది ఏమి మాట్లాడితే ఏమి పర్యవసానాలు ఉంటాయన్నది కూడా ఆలోచించరని అంటారు. లేకపోతే పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ జనసేన ఆవిర్భావ సభలో పొగడడం వరకూ ఓకే కానీ మిత్రపక్షం టీడీపీ విషయంలో ఆ సెటైర్లు ఎందుకు అన్నదే చర్చ సాగుతోంది.
పిఠాపురంలో జనసేన గెలిచింది అంటే రెండు ఫ్యాక్టర్లు అని నాగబాబు చెప్పారు ఒకటి పిఠాపురం ప్రజలు పౌరులు అన్నారు. రెండవది పవన్ కళ్యాణ్ చరిష్మా అన్నారు. మరి టీడీపీ సాయం లేదా అని తమ్ముళ్ళు అంటున్నారు. పైగా ఎవరైనా తామే గెలిపించామని అనుకుంటే మీ ఖర్మ అని అనడం ద్వారా నాగబాబు తమ్ముళ్లకు కన్నెర్ర అయ్యారని అంటున్నారు.
ఎమ్మెల్సీగా గెలిచిన తరువాతనే ఈ రకంగా దూకుడు చేస్తే మంత్రిగా ఆయన తనను తాను సంభాళించుకుపోతే ఇబ్బంది కదా అన్న చర్చ వస్తోందిట. దాంతో నాగబాబు పదవి విషయంలో మళ్ళీ ఆలోచించేలాగానే ఉంది అని అంటున్నారు. నాగబాబు మంత్రి అవుతారు అన్నది కొద్ది నెలల క్రితం జరిగిన ప్రచారం. ఇపుడు చూస్తే ఆ విధంగా పరిస్థితి ఉందా అంటే డౌటే అంటున్నారు.
ఇప్పటికే జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఇక బీజేపీకి మరోటి ఇవ్వాలని డిమాండ్ ఉంది. దాంతో పాటు తమ్ముళ్ళలో ఆశలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు ఒక్కరికీ మంత్రి పదవి ఇస్తే ఇబ్బంది అవుతుందన్న లెక్కలు ఉన్నాయట. కారణాలు ఏమి అయినా నాగబాబుకు మంత్రి పదవి చేతిలోకి వచ్చి నోటి దాకా వస్తుందా లేదా అంటే వేచి చూడాల్సిందే అంటున్నారు.