నాగబాబుకు మంచి పోర్టుఫోలియో ?
మెగా బ్రదర్ నాగబాబు మంత్రి అవుతున్నారు. ఆయనకు ఈ చాన్స్ చాలా తొందరలోనే కలగబోతోంది.
By: Tupaki Desk | 4 March 2025 4:45 PM ISTమెగా బ్రదర్ నాగబాబు మంత్రి అవుతున్నారు. ఆయనకు ఈ చాన్స్ చాలా తొందరలోనే కలగబోతోంది. నాగబాబు ఎమ్మెల్సీ అవుతున్నారు. అలా తొలిసారి చట్టసభలలో అడుగుపెట్టనున్నారు. ఆయన 2025 మార్చి 30 నుంచి ఎమ్మెల్సీ అవుతారు. అలా 2031 మార్చి 30 దాకా ఆయన చట్టసభ సభ్యత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు.
ఇక నాగబాబు కేవలం ఎమ్మెల్సీగా ఉండిపోరు అన్నది తెలిసిందే. ఆయనకు మంత్రి పదవి ఆల్రెడీ ఆఫర్ చేస్తూ కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన కూడా చేసి ఉన్నారు. దాంతో విస్తరి రెడీగా ఉంది. నాగబాబుకు ఇక దక్కేది ఎపుడు అన్నదే మిగిలింది.
అయితే ఉగాది వేళ మంచి ముహూర్తాన నాగబాబు మంత్రిగా ప్రమాణం చేస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే తన సోదరుడు నాగబాబుకు మంచి పోర్టుఫోలియో ఇప్పించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుని తాజాగా కలసినపుడు ఇదే విషయం చెప్పి ఉంటారని ప్రచారం సాగుతోంది.
కీలకమైన శాఖలు ఇస్తే నాగబాబుకు కూడా సమర్ధంగా పనిచేసే వీలు ఉంటునని అంతే కాకుండా ఈ మంత్రి పదవుల ద్వారా జనసేన రాజకీయంగా పార్టీ పరంగా కూడా మరింతగా బలోపేతం అయ్యేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు.
పైగా నాగబాబు జనసేనలో పవన్ తరువాత స్థాయివారుగా ఉంటారు. ఆయనకు కీలక శాఖలు ఇస్తే ఆయన మంత్రిగానే కాకుండా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తారు అని అంటున్నారు. దాంతోనే అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని పవన్ నాగబాబు మంత్రిత్వ శాఖల మీద ప్రత్యేక దృష్టి పెట్టారని అంటున్నారు.
ఈ క్రమంలో చూసుకుంటే నాగబాబుకు వాణిజ్య పన్నుల శాఖ కానీ లేదా రోడ్లు భవనాల శాఖ కానీ ఇవ్వాలని నేరుగానే సీఎం ని కోరారని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే తుది నిర్ణయం మాత్రం సీఎం కే పవన్ వదిలేశారని చెబుతున్నారు. మరి ఈ కీలక శాఖలను మార్చి ఇవ్వాలంటే మంత్రివర్గాన్ని రీ షఫల్ చేయాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు.
అయితే నాగబాబు ఒక్కరికే మంత్రి పదవి ఇచ్చి ప్రమాణం చేయిస్తే సరిపోతుందని కూడా కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు. ఒకసారి కనుక రీ షఫిల్ అంటూ కదిపితే చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుందని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం అంటే జనసేన నుంచి నలుగురు మంత్రులుగా ఉంటారు అన్న మాట. అందులో ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అవుతారు. అయితే తాను కులాలు ఇతర విషయాలు చూడనని ప్రతిభ ఆధారంగానే పదవులు ఉంటాయని ఇప్పటికే పవన్ ప్రకటించిన నేపథ్యంలో నాగబాబు మంత్రి పదవి మీద ఎలాంటి విమర్శలు వచ్చినా సరైన జవాబుతోనే జనసేనాని రెడీగా ఉన్నారని అంటున్నారు.