Begin typing your search above and press return to search.

అన్నచిరు.. తమ్ముడు పవన్ వద్ద అప్పులు తీసుకున్న నాగబాబు!

మొత్తం తనకు రూ.11 కోట్ల స్థిరాస్తులు.. రూ.59 కోట్ల చరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్న నాగబాబు.. వాటి వివరాల్ని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   9 March 2025 10:02 AM IST
అన్నచిరు.. తమ్ముడు పవన్ వద్ద అప్పులు తీసుకున్న నాగబాబు!
X

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు కొణిదల నాగబాబు అలియాస్ నాగేంద్రరావు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తులు.. అప్పుల గురించి వివరంగా వెల్లడించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేసిన నాగబాబు.. ఆస్తులు, అప్పులకు సంబంధించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ఇందులో అన్న చిరంజీవి వద్ద.. తమ్ముడు పవన్ కల్యాణ్ వద్ద అప్పులు చేసినట్లుగా పేర్కొన్నారు.

మొత్తం తనకు రూ.11 కోట్ల స్థిరాస్తులు.. రూ.59 కోట్ల చరాస్తులు ఉన్నట్లుగా పేర్కొన్న నాగబాబు.. వాటి వివరాల్ని వెల్లడించారు. చరాస్తుల విషయానికి వస్తే మ్యూచువల్ బాండ్లు.. ఫండ్స్ రూ.55.37కోట్లు.. చేతిలో నగదు రూ.21.8 లక్షలు.. బ్యాంకులో రూ.23.53 లక్షలు.. ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.1.03 కోట్లు.. బెంజ్ కారు రూ.67.28 లక్ష్లు.. హ్యుందయ్ కారు రూ.11.04 లక్షలు.. రూ.18.10 లక్షలు విలువ చేసే 2.2 కేజీల బంగారం.. భార్య వద్ద రూ.16.5 లక్షల విలువ చేసే వజ్రాలు.. రూ.57.99 లక్షల విలువైన బంగారం .. రూ.21 లక్షలు విలువ చేసే 20 కేజీల వెండి ఉన్నట్లుగా పేర్కొన్నారు. తనకు.. తన భార్యకు కలిపి చరాస్తుల మొత్తం రూ.59.12 కోట్లు ఉన్నట్లుగా వెల్లడించారు.

స్థిరాస్తుల విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు చోట్ల 2.39 ఎకరాల భూమి ఉన్నదని.. దాని విలువ రూ.3.55 కోట్లుగా పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో 3.28 ఎకరాల భూమి దాని విలువ రూ.32.8 లక్షలుగా పేరకొన్నారు. అదే ప్రాంతంలో రూ.50 లక్షల విలువైన ఐదు ఎకరాల భూమి.. రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో రూ.53.5 లక్షల విలువైన 1.07 ఎకరాల భూములు ఉన్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ లోని మణికొండలో రూ.2.88 కోట్లు విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా ఉంది. మొత్తంగా రూ.11.2 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.

అప్పుల విషయానికి వస్తే తన అన్న చిరంజీవి నుంచి రూ.28.4 లక్షలు.. తమ్ముడు పవన్ కల్యాణ్ నుంచి రూ.6.9లక్షల అప్పు తీసుకున్నట్లు చెప్పారు. రెండు బ్యాంకుల్లో ఇంటి మీద రూ.56.97లక్షలు.. కారు మీద రూ.7.54 లక్షలతో పాటు ఇతర వ్యక్తులు.. సంస్థల నుంచి తీసుకున్న అప్పులన్నీ కలిపి రూ.1.64 కోట్లు ఉంటాయని వెల్లడించారు.