పవన్ సనాతన ధర్మంపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 Oct 2024 6:41 AM GMTప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనెలు కలిశాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సిట్ విచారణకు కూడా ఆదేశించింది.
మరోవైపు డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడలో కనకదుర్గమ్మ గుడి మెట్లను కడిగి ఆయన పసుపు కుంకుమ పూశారు. తక్కువ ధరకు వచ్చే నెయ్యిని వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. ఆ ప్రభుత్వ హయాంలో తిరుమలలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని పవన్ ఆరోపించారు.
అంతేకాకుండా లడ్డూ వ్యవహారంలో వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్, ప్రముఖ తమిళ నటుడు కార్తీలపై పవన్ పదునైన వ్యాఖ్యలు చేశారు.
ఇంకోవైపు తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సీఎం చంద్రబాబు తీరును తప్పబడుతూ కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో పవన్, చంద్రబాబులపై నెటిజన్లతోపాటు ప్రకాశ్ రాజ్ వంటివారు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ముఖ్య నేత నాగబాబు ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను విమర్శించే వారు.. సూడో సెక్యులర్ లు ధ్వజమెత్తారు. హిందువులే హిందువులను అవమానించడం సబబుకాదని మాత్రమే పవన్ చెప్పారన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు తప్పు ఎలా అవుతాయని ప్రశ్నించారు. సూడో సెక్యులరిస్టులు చేసే వ్యాఖ్యలను తాము పట్టించుకోబోమని తేల్చిచెప్పారు.
మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ వ్యవహారంపైనా నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ గురించి ఒక్కటే మాట చెబుతానని.. అన్ని మతాలను అందరూ గౌరవించాలి అని నాగబాబు వ్యాఖ్యానించారు. హిందూ ధర్మ పరిరక్షణ కమిటీని కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు.