కొణెదల నాగబాబు అనే నేను.. ఇంకెంతో కాలం లేదు
జనసేన ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో సోదరుడు కొణెదల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబుకు పదవీ యోగం పట్టనుందని అంటున్నారు.
By: Tupaki Desk | 24 Feb 2025 5:30 PM GMTజనసేన ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో సోదరుడు కొణెదల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబుకు పదవీ యోగం పట్టనుందని అంటున్నారు. త్వరలో ఏపీలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు బెర్త్ కన్ఫాం అయిందని చెబుతున్నారు. మార్చి 29న ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఇందులో టీడీపీ సీనియర్ నేతలు యనమల రామక్రిష్ణుడు, పరుచూరి అశోక్ బాబు వంటి సీనియర్లు ఉన్నారు. అయితే ఖాళీ అయ్యే స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. సభలో కూటమికి బలం ఉన్నందున ఏకగ్రీవమయ్యే చాన్స్ ఉంది. అయితే కూటమిలో మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని ఎమ్మెల్సీలిస్తారు? అనేది ఇంట్రస్టింగుగా మారింది. అయితే ఐదు ఖాళీల్లో జనసేన కోటాలో నాగబాబుకు అవకాశం పక్కా అనేది తెలుస్తోంది. దీంతో ఆయనకు పదవీ యోగం పట్టనుందని జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలతోపాటు నామినేటెడ్ పోస్టులల్లో మూడు పార్టీల వారికి అవకాశం ఇవ్వాలని ముందుగా నిర్ణయించుకున్నారు. ఈ ప్రకారం గతంలో రెండు ఎమ్మెల్సీలకు ఉప ఎన్నికలు జరిగితే ఒకటి జనసేనకు కేటాయించారు. అదేవిధంగా మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఒకటి బీజేపీకి కేటాయించారు. ఇక ఐదు ఎమ్మెల్సీలకు తాజాగా ఎన్నిక జరగనుందని జనసేనకు ఒకస్థానం పక్కాగా కేటాయిస్తారంటున్నారు. ఆ ఒక్క ఖాళీ నుంచి నాగబాబుకు తప్పక అవకాశం దక్కనుందని అంటున్నారు. గతంలో రాజ్యసభ స్థానాన్ని ఆశించిన నాగబాబు బీజేపీ రూపంలో చాన్సు కోల్పోయారు. అంతకుముందు లోక్ సభకు పోటీ చేయాలనే ఆలోచనకు కూడా బీజేపీ గండికొట్టింది. ఇక మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానంలో నాగబాబును ఎన్నుకోవాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే ఆ స్థానానికి ఇంకా నోటిఫికేషన్ రానందున గతంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం నాగబాబును మంత్రి చేసేందుకు ముందుగా ఎమ్మెల్సీ చేయాలని జనసేన నేతలు కోరుతున్నారు.
గతంలో రాజ్యసభ స్థానాన్ని త్యాగం చేసిన నాగబాబును రాష్ట్రం మంత్రివర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. గత డిసెంబరులో ఈ ప్రకటన వెలువడినా మంత్రివర్గ విస్తరణ మాత్రం చేయలేదు. దానికి కారణం నాగబాబు ప్రస్తుతం చట్టసభ సభ్యుడు కాకపోవడమే అంటున్నారు. జనసేనాని పవన్ సైతం ముందుగా ఏదో ఒక సభకు నాగబాబును నామినేట్ చేసిన తర్వాతే మంత్రివర్గంలోకి చేర్చుకుంటామని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్యమైనట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చట్టసభలో అడుగు పెట్టేందుకు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న నాగబాబు ఆశలు ఫలించినట్లే కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది.
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు మార్చి మూడు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు అవుతుంది. మార్చి 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11న పరిశీలన, 13న ఉప సంహరణ ఉంటుంది. అయితే ప్రతిపక్షం పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో నామినేషన్ల ఉప సంహరణ రోజే ఎమ్మెల్సీలు ఏకగ్రీవమయ్యారంటూ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అంటే నెక్ట్స్ వీకే ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన నామినేషన్ వేస్తే ఎమ్మెల్సీగా గెలిచేసినట్లేనంటున్నారు. దీంతో మరో రెండు వారాల్లో ఎమ్మెల్సీ కాబోతున్న నాగబాబు.. మంత్రిగా బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం అంటున్నారు. ఎలాగూ ఉగాది వస్తున్నందున ఆ రోజునే మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆ ఒక్కస్థానాన్ని భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అంటే ఉగాదికి నాగబాబు మంత్రి యోగం పట్టినట్లే అంటున్నారు.