జనంలోకి నాగబాబు... వ్యూహాత్మకమేనా ?
అయితే జనంలోకి వెళ్ళడం ద్వారా తాను జన నాయకుడిని అని చెప్పుకోవడం కూడా అవసరం అన్నది భావించే ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 1 Feb 2025 5:30 PM GMTజనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయిలో జనాలకు చేరువ అయ్యే విధంగా మెగా బ్రదర్ నాగబాబు తన తొలి అడుగులు వేస్తున్నారు. ఆయన స్వతహాగా పవన్ సోదరుడు కావడం ఒక రకమైన పొలిటికల్ అడ్వాంటేజ్. పైగా ఆయన తెర వెనక జనసేన నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించిన వారుగా ఉన్నారు. ఇపుడు పార్టీ జనంతో పాటు సాదర జనాన్ని కూడా కలుసుకునే విధంగా వ్యూహాత్మకంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆయన తొలిగా చేపడుతున్న కార్య్రకమం పేరు జనంలోకి జనసేన. ఇది మొత్తం జనసేన పార్టీకి సంబంధించినది. ఈ కార్యక్రమం ద్వారా జనసేన జనంలో ఎలా ఉంది, ఆ పార్టీని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నది ఈ కార్యక్రమం ద్వారా ఒక అంచనా వేసుకునేందుకే ఈ ప్రోగ్రాం ని డిజైన్ చేశారని అంటున్నారు.
అదే సమయంలో అధికారంలోకి వచ్చాక జనసేన పెద్దగా జనంలోకి కనెక్ట్ కావడం లేదు అన్నది ఉంది. పైగా ఇది మంచి అవకాశంగా పార్టీని నిర్మించుకోవాల్సి ఉంది. దాంతో నాగబాబు ఈ విధంగా చేస్తున్నారని జనంలోకి జనసేనను మరింతగా అనుసంధానం చేయడం ద్వారా పార్టీని పటిష్టం చేసేందుకు చూస్తున్నారు అని అంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికరంలో ఉంది. టీడీపీ జనసేన బీజేపీ కలసి సర్కార్ ని స్థాపించాయి. ఎనిమిది నెలల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నాయి. దాంతో వాటి మీద జనాలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవడం కూడా ఈ కార్యక్రమం ఉద్దేశ్యం గా కనిపిస్తోంది అని అంటున్నారు. అలాగే ప్రజల ఆకాంక్షలు ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద ఉన్నాయో వారు ఇచ్చిన 164 సీట్ల ద్వారానే తెలుస్తోంది అని అంటున్నారు.
ఈ క్రమంలో ప్రజల ఆకాంక్షలను కూడా తెలుసుకునే ప్రయత్నమే జనంలోకి జనసేన అన్నది కూడా అంటున్నారు. ఇక చూస్తే నాగబాబు తొందరలోనే ఏపీ కేబినెట్ లో మంత్రిగా చేరబోతున్నారు. ఆయన పవన్ సోదరుడు అన్న ట్యాగ్ తో చేరుతున్నారు అన్న విమర్శలు అక్కడక్కడ ఉన్నాయి.
అయితే జనంలోకి వెళ్ళడం ద్వారా తాను జన నాయకుడిని అని చెప్పుకోవడం కూడా అవసరం అన్నది భావించే ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. ప్రజామోదం ముందుగా తీసుకునే ఆ మీదట అమాత్య కిరీటం అలంకరించాలన్నది కూడా దీని వెనక ఉంది అని అంటున్నారు. అంటే జనంలోకి ముందుగా వచ్చి వారి నాయకుడిగా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఆ విధంగా మంత్రి అయితే ఆ లెక్క వేరేగా ఉంటుందని భావించే జనసేన ఈ విధంగా నాగబాబుని పంపిస్తోంది అని అంటున్నారు.
ఇక్కడ మరో కీలక విషయం ఏంటి అంటే జనంలోకి జనసేన కార్యక్రమం కోసం పుంగనూరు నియోజకవర్గాన్ని ఎంచుకోవడం. ఈ సీటు వైసీపీకి పెట్టని కోట. ఒక విధంగా చెప్పాలీ అంటే కంచుకోట. ఇక్కడ నుంచి అనేకసార్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచారు. 2024లో కూటమి ప్రభజనం ఎంతగా ఉన్నా పెద్దిరెడ్డి గెలిచారు అంటేనే ఆలోచించాలని అంటున్నారు.
దాంతో ఈ నియోజకవర్గం నుంచి జనసేన తమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అంటే కచ్చితంగా వైసీపీని దాని కంచుకోటను టార్గెట్ చేసినట్లే అని అంటున్నారు. అంటే వైసీపీ నియోజకవర్గాలు వైసీపీకి పట్టున్న ప్రాంతాలలో జనసేన బలం పెంచుకోవడమే ఈ కార్యక్రమం అజెండాగా ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద చూస్తే నాగబాబు ఈ జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా పుంగనూరు వేదికగా అటు జనానికి ఇటు జనసేనకు ఏమి చెప్పబోతున్నారు అన్నదే ఆసక్తికరంగా ఉంది.