ఎమ్మెల్సీ లాంచనం...నాగబాబు వాట్ నెక్స్ట్ ?
ఇక మంచి రోజు చూసుకుని నాగబాబు తన నామినేషన్ పత్రాలను శుక్రవారం దాఖలు చేశారు.
By: Tupaki Desk | 7 March 2025 8:39 PM ISTమెగా బ్రదర్ ఎమ్మెల్సీ అయినట్లే. ఆయన నామినేషన్ దాఖలు చేయడంతోనే ఆ విషయం స్పష్టం అయింది. జనసేన టీడీపీ బీజేపీల కలయికతో ఆయన ఖాళీ అయిన అయిదు ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకుంటారు. ఇది రాజకీయ గణితం చెబుతున్న మాట. ఇక మంచి రోజు చూసుకుని నాగబాబు తన నామినేషన్ పత్రాలను శుక్రవారం దాఖలు చేశారు.
ఆయన వెంట కూటమి పెద్దలు అంతా తరలివచ్చారు. సో ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం తరువాత నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు. ధృవీకరణ పత్రాన్ని అందుకుంటారు. ఇందులో ఏ మార్పూ లేదు. మరి నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాక ఏమి జరుగుతుంది అన్నదే చర్చగా ఉంది.
నిజానికి నాగబాబుకు మంత్రి పదవి ఆఫర్ ఉంది. అది ఇచ్చిన వారు టీడీపీ కూటమి పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు. బ్లాక్ చెక్ లాంటి ఈ ఆఫర్ ని నెరవేర్చుకునేందుకు ఈ నెల 13 తర్వాత ఎపుడైనా నాగబాబుకు చాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు నుంచి ఆయన అధికారికంగా ఎమ్మెల్సీ అయినట్లే
ఆరేళ్ళ పాటు ఆయన శాసనమండలిలో మెంబర్ గా ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన కోసం ఏళ్ళకు ఏళ్ళు కష్టపడుతున్న నాగబాబుకు పెద్దల సభలో మెంబర్ షిప్ దక్కడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. ఇక నాగబాబు మినిస్టర్ నాగబాబు అయ్యే ముహూర్తం దగ్గరలోనే ఉందని అంటున్నారు.
బహుశా ఉగాది వేళ తెలుగు వారి అందరికీ పండుగ వేల నాగబాబు మంత్రి అవుతారు అని అంటున్నారు. సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం 2017లో ఇలాగే ఉగాది వేళ నారా లోకేష్ ఎమ్మెల్సీగా నెగ్గి మంత్రి అయ్యారు. ఆయన రాజకీయ జీవితం ఆ తరువాత ఎంతగా ప్రవర్ధమానం అయిందో అందరికీ తెలుసు. ఇపుడు నాగబాబుకు కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తారు అని అంటున్నారు
నాగబాబు మంత్రి అన్న దాంతో అయితే సరిపోదు. ఆయనకు ఏ శాఖ ఇస్తారు అన్న చర్చ కూడా మరోటి ఉంది. జనసేనను ఎంతో సమాదరిస్తున్న టీడీపీ నాగబాబుకు మంచి ప్రాముఖ్యత కలిగిన శాఖ ఇవ్వకుండా ఉంటుందా అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం టీడీపీలో కొందరికి ఇష్టం లేదని ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తారని మీడియాలో రెండు రోజుల క్రితం వార్తలు వచ్చాయి.
దాంతో కూటమిలో ఏదో జరుగుతోంది అని అంతా అనుకున్నారు. కానీ అవనీ జస్ట్ పుకారులే అన్నట్లుగా నారా లోకేష్ స్వయంగా వచ్చి నాగబాబు ఎమ్మెల్సీ సభ్యత్వానికి మద్దతు పలికారు. ఇక నాగబాబు మంత్రి పదవి విషయంలో కూడా వేరే విధమైన అభిప్రాయాలు ఎవరికీ ఉండవని అంటున్నారు. సో మినిస్టర్ నాగబాబు అని తరువాత జరగబోయేది ఇదే అని అంతా బల్లగుద్దుతున్నారు. అదన్న మాట మ్యాటర్.