మంత్రి కాకముందే మెరుపులు.. నాగబాబు డిఫరెంట్ స్టయిల్.. !
పుంగనూరులో నిర్వహించిన జనసేన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా ఉన్నాయి.
By: Tupaki Desk | 3 Feb 2025 7:30 AM GMTజనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఫైర్ బ్రాండ్ నాగబాబు.. త్వరలోనే మంత్రి కానున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు రెండు నెలల కిందటే చెప్పారు. అయితే.. నాగబాబు మంత్రి అయ్యేందుకు మరో రెండు మాసాలు గడువు ఉందన్న చర్చ కొనసాగుతోంది. ఇంతలోనే నాగబాబు మెరుపులు మెరిపిస్తున్నారు. తన సత్తాను మరోసారి చాటుతున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలును వివరించడంలోనూ.. వైసీపీ నేతలపై విరుచుకుపడడంలోనూ నాగబాబు తాజాగా మరోసారి చర్చకు వచ్చారు. పుంగనూరులో నిర్వహించిన జనసేన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా ఉన్నాయి.
నిజానికి నాగబాబు.. పార్టీ తరఫున గత ఎన్నికలకు ముందు నుంచి కూడా బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. తనదైన స్టయిల్‌లో సెటైర్లు వేయడంతోపాటు.. కీలక పాయింట్లను బయటకు తీసి వైసీపీని ఇరుకున పెట్టిన సంగతి కూడా తెలిసిందే. ఇక, తాజాగా నిర్వహించిన పుంగనూరు సభలో కూటమిపై కొన్నాళ్లుగా వైసీపీ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు. ఏడు మాసాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఆయన వివరించారు. పింఛన్ల నుంచి విశాఖ స్టీల్ ప్లాంటుకు నిధులు రాబట్టే వరకు.. కూటమి సర్కారు కృషిని ఆయన వివరించారు. అదేవిధంగా డీఎస్సీ ప్రకటన, రహదారుల నిర్మాణం వంటివాటిని ప్రస్తావించారు.
తద్వారా కూటమి ఏడు మాసాల్లో సాధించిన రికార్డులు, చేసిన పనులను నాగబాబు వివరించినట్టు అయింది. ఇక, ఇదేసమ యంలో వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. సహజంగానే పుంగనూరులో సభ కాబట్టి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు చేయడం ఖాయం. కానీ, నియోజకవర్గానికి సంబంధం లేని నాయకులపైనా నాగబాబు.. కామెంట్లు చేశారు. అక్రమాలు అవినీతిపై దృష్టి పెట్టామని.. వైసీపీనాయకులు తప్పించుకోలేరని.. జగన్ సహా .. అందరికీ జైలు బాట తప్పదని చెప్పుకొచ్చారు. త్వరలోనే మాజీ మంత్రుల సంగతి తేల్చేస్తామని కూడా నాగబాబు వెల్లడించారు.
ఈ పరిణామాలతో మంత్రి కాకుండానే నాగబాబు కూటమి సర్కారుకు దన్నుగా మారారని జనసేన నాయకులు చెబుతున్నారు. ఇక, ఆయన మంత్రి అయితే.. తిరుగు ఉండదని, బలమైన గళం తోడైనట్టేనని భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఇప్పుడు కావాల్సిం ది.. చేసింది చెప్పుకొనే నాయకులు, ప్రజల్లోకి వెళ్లే నాయకులు. ఇదే విషయాన్ని చంద్రబాబు సైతం పదే పదే చెబుతున్నారు. కానీ, కొందరే ఆయన చెప్పినట్టు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పుంగనూరు సభ ద్వారా.. నాగబాబు మెరుపులు మెరిపిం చి.. పెద్ద ఎత్తున తన ఉనికి చాటుకున్నట్టు అయిందని మంత్రి వర్గంలో ఆయనకు మేలైన మర్యాద కూడా దక్కనుందని జనసేన నాయకులు అంచనా వేస్తున్నారు.