Begin typing your search above and press return to search.

రఘురామ సీటుకు నాగబాబు ఎర్తు పెడతారా...!?

పొత్తు లేకపోతే ఆ టికెట్ బీజేపీకి ఇవ్వకపోతే అపుడు పరిస్థితి ఏంటి అన్నది కూడా చర్చకు వస్తోంది. ఇక మెగా బ్రదర్ నాగబాబుని ఈసారి పొత్తులో గెలిపించుకుని ఎంపీగా చూడాలని పవన్ గట్టిగా భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 March 2024 5:45 PM GMT
రఘురామ సీటుకు నాగబాబు ఎర్తు పెడతారా...!?
X

ట్రిపుల్ ఆర్ అంటూ గత అయిదేళ్ళుగా సొషల్ మీడియాలో హల్ చల్ చేసిన నర్సాపురం మాజీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు రాజకీయం ఏంటో తేల్చేసే ఎన్నికలు ఇవి. ఆయనకు 2019లో వైసీపీ టికెట్ ఇచ్చింది. ఆయన జగన్ వేవ్ లో గెలిచారు. అవతల వైపు నాగబాబు పోటీ చేసినా తట్టుకున్నారు. గెలిచిన ఆరు నెలల వ్యవధిలో ఆయన ప్లేట్ ఫిరాయించారు.

తాను గెలిచిన పార్టీకే ప్రధాన ప్రత్యర్ధి అయిపోయారు. ఇక ఆయన నాడు టీడీపీ జనసేనలకు బాగా దగ్గర అయ్యారు. ప్రతిపక్షానికి అధికార పార్టీ ఎంపీ విమర్శలు చేయడం కూడా రాజకీయ లాభంగా బాగానే మారింది. దాంతో ఆయనకు విపక్ష కూటమి నుంచి మంచి ప్రోత్సాహం దక్కింది. అయితే అదంతా గతం. ఇపుడు ఎన్నికలు వచ్చేశాయి.

రఘురామకు టికెట్ కావాలి. ఆయన మూడు పార్టీలతోనూ సన్నిహితంగా ఉంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు నర్సాపురం టికెట్ ఇస్తారని ప్రచారం సాగింది. దానికి జనసేన కూడా ఓకే అంది కూడా చెప్పుకున్నారు. ఇటీవల తాడేపల్లిగూడెం సభలో కూడా రఘురామ తాను నర్సాపురం నుంచి ఎంపీగా మళ్లీ పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

పొత్తులో కాషాయ పార్టీకి నర్సాపురం ఎంపీ టికెట్ ఇస్తే ఆయన బీజేపీ తరఫున పోటీ చేయవచ్చు అని అంటున్నారు. పొత్తు లేకపోతే ఆ టికెట్ బీజేపీకి ఇవ్వకపోతే అపుడు పరిస్థితి ఏంటి అన్నది కూడా చర్చకు వస్తోంది. ఇక మెగా బ్రదర్ నాగబాబుని ఈసారి పొత్తులో గెలిపించుకుని ఎంపీగా చూడాలని పవన్ గట్టిగా భావిస్తున్నారు.

నాగబాబుని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించాలని చూసారు. నాగబాబు అనకాపల్లిలో పోటీ కోసం చాన్నాళ్ల క్రితం అక్కడ విడిది చేసి మరీ సమీక్షలు నిర్వహించారు. అచ్యుతాపురంలో ఇల్లు కూడా తీసుకున్నారు. ఇవన్నీ బాగానే ఉన్న టీడీపీ కూటమి తొలి జాబితా వెలువడిన తరువాత అసలు కధ మొదలైంది. అనకాపల్లి అసెంబ్లీ టికెట్ నిప్పుని రాజేస్తొంది.

అలాగే చాలా సమీకరణలు కుదరడంలేదు. దాంతో నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ విషయం డైలామాలో పడింది. ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయరు అని ప్రచారం కూడా సాగింది. మరి నాగబాబు ఎక్కడ నుంచి పోటీ అంటే నర్సాపురం అని ఇపుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట. అనకాపల్లి ఎంపీ టికెట్ ని టీడీపీకి ఇచ్చేసి నర్సాపురం నుంచి జనసేన పోటీకి సిద్ధపడుతోంది అని అంటున్నారు.

ఎటూ నాగబాబు 2019లో ఇక్కడ నుంచి పోటీ చేసి రెండున్నర లక్షలకు పైగా ఓట్లను తెచ్చుకున్నారు. ఈసారి పొత్తు ఉంటుంది కాబట్టి గెలుపు ఖాయమని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. నాగబాబు ఓకే అయితే ట్రిపుల్ ఆర్ సంగతేంటి అన్నది చర్చకు వస్తోంది.

ఆయనకు నర్సాపురం తప్ప వేరే సీటు లేదు. బీజేపీకి అయితే వేరే చోట అడ్జస్ట్ చేయవచ్చు. ఇలా పార్టీలు మూడు ఎక్కడో ఒక చోట సర్దుకుంటే అందరికీ బాగానే ఉంటుంది కానీ రఘురామకు సీటు ఎక్కడ అన్నదే ప్రశ్న. ఈ సమీకరణలు చూస్తూంటే రఘురామకు నర్సాపురం దక్కేలా లేదు అని అంటున్నారు.

నిజానికి దివగంత వైఎస్సార్ కి తాను అత్యంత సన్నిహితుడిని అని చెప్పుకున్నా కూడా 2009లో నర్సాపురం టికెట్ రఘురామకు దక్కలేదు. 2014లో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసినా బీజేపీ ఆ సీటు పొత్తులో తీసుకుని తమ అభ్యర్ధిని గెలిపించుకుంది. ఇక 2019లో వైసీపీలోకి రావడం ద్వారానే రఘురామ తన ఎంపీ కోరిక తీర్చుకున్నారు అని అంటున్నారు. ఇపుడు కనుక ఆయనకు నర్సాపురం దక్కకపోతే మాజీ ఎంపీగా ఉండాల్సిందే అని అంటున్నారు. మొత్తానికి నాగబాబు అనకాపల్లి నుంచి నర్సాపురానికి షిఫ్ట్ అయితే రాజు గారికే దెబ్బ అని అంటున్నారు.