అనకాపల్లి నాగబాబుకు గెలుపు గుర్రమేనా...!?
అనకాపల్లి ఎంపీ సీటు నుంచి పోటీ చేయడానికి జనసేన కీలక నేత నాగబాబు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 9 Feb 2024 4:02 AM GMTఅనకాపల్లి ఎంపీ సీటు నుంచి పోటీ చేయడానికి జనసేన కీలక నేత నాగబాబు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే నాగబాబు పోటీ చేయడానికి ఎంచుకున్న ఈ సీటు ఆయనకు సేఫ్ జోన్ గా ఉంటుందా అన్నదే చర్చగా ఉంది. అనకాపల్లిలో కాపులు అధికంగా ఉన్నారు టీడీపీ బలంగా ఉంది, జనసేనకు ఉత్సహాం ఉంది అన్న లెక్కల్తో నాగబాబు దిగిపోతున్నారు అని అంటున్నారు.
అయితే అనకాపల్లి ఎంపీ సీటుని లోకల్స్ చాలా మంది ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ ఆ సీటు మీద ఆశలు పెట్టుకునే జనసేనలో చేరారు. అలాగే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తన కుమారుడి కోసం ఈ సీటుని ఎంపిక చేసుకున్నారు. ఈ ఇద్దరూ బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారు. వీరి ఆశలకు గండి కొట్టి నాన్ లోకల్ గా నాగబాబు వస్తే ఆయనను గెలిపించేందుకు టీడీపీ నుంచి కానీ స్థానిక నేతల నుంచి కానీ ఎంతమేరకు సహకారం లభిస్తుంది అన్నది పెద్ద ప్రశ్న.
ఇదిలా ఉంటే జనసేనలో కూడా వర్గ పోరు దండీగా ఉంది. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో చాలా చోట్ల టీడీపీ జనసేనల మధ్య సఖ్యత లేదు. జనసేనలోనూ వర్గ పోరు కనిపిస్తోంది. పెందుర్తిలో చూస్తే జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ కి మాజీ ఎమ్మెల్యే పంచకర రమేష్ బాబుకు పడడంలేదు అని అంటున్నారు.
ఎలమంచిలిలో జనసేనకు టికెట్ ఇస్తే టీడీపీలో తమ్ముళ్ళు గుర్రుగా ఉంటారు అన్నది వాస్తవం ఆ సీటు మీద గవర సామాజిక వర్గం నేతలు ఆశలు పెట్టుకున్నారు. మాడుగులలో చూస్తే వైసీపీ ఆధిక్యంలో ఉంది. ఇక్కడ టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. తోడు అన్నట్లుగా జనసేన నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. పాయకరావుపేటలో చూస్తే మాజీ ఎమ్మెల్యే అనితకు టికెట్ ఇవ్వవద్దు అని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ టీడీపీ జనసేనలో కూడా వర్గ పోరు ఉంది.
ఇక అనకాపల్లి టీడీపీలో కూడా వర్గ పోరు ఉంది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ జగదీష్ ల మధ్య సీటు కోసం వార్ సాగుతోంది. ఇక్కడ జనసేన నేత గంటా బంధువు అయిన పరుచూరి భాస్కరరావు సీటు కోరుతున్నారు. నర్శీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన కొడుకుకి టికెట్ ఇవ్వకపోతే నాగబాబుకు ఎంత వరకూ సహకారం దక్కుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఇలా చాలా రకాలుగా అనకాపల్లి ఎంపీ సీటు పరిధిలో గందరగోళం ఉంది అని అంటున్నారు.
వీటికి మించి స్థానిక నినాదమే నాగబాబుకు మైనస్ గా మారుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా నాగబాబు పోటీ చేయడం అంటూ ఖాయం అయితే అనకాపల్లి ఎంపీ సీటులో ఇంటరెస్టింగ్ గానే పోరు సాగుతుంది. వైసీపీకి కూడా ఇక్కడ బలం ఉంది. దాంతో ఆ పార్టీ నాగబాబుని ఓడించేందుకు ఏమైనా వ్యూహాలు రూపొందిస్తుంది అని అంటున్నారు. దీని కంటే నాగబాబు నర్సాపురం నుంచి మరోసారి పోటీ చేస్తే గెలుపు ఖాయం అని అంటున్నారు.