ఫుల్ సైలెంట్ మోడ్ లో నాగబాబు...!?
నాగబాబు ఎంపీ గా గెలుస్తారు అది ఖాయం. ఇక ఆయన కేంద్రంలో మంత్రి అవడం అంతకంటే ఖాయం అని ఒక రేంజిలో ప్రచారం కూడా సాగింది.
By: Tupaki Desk | 11 March 2024 7:55 AM GMTమెగా బ్రదర్ కి సీటు లేదు. ఉన్న సీటు కూడా పోయింది. ఇదీ పబ్లిక్ లో వినిపిస్తున్న టాక్. అనకాపల్లి నుంచి ఎంపీగా నాగబాబు అంటే అంతా ఆహా ఓహో అన్నారు. నాగబాబు కూడా ఎక్కడా రెస్ట్ అన్న మాట లేకుండా డైరెక్ట్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో దిగిపోయి ఆ వెంటనే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో రివ్యూలు చేశారు. ఏకంగా వారం పది రోజుల పాటు నాగబాబు సందడి అలా సాగింది.
నాగబాబు ఎంపీ గా గెలుస్తారు అది ఖాయం. ఇక ఆయన కేంద్రంలో మంత్రి అవడం అంతకంటే ఖాయం అని ఒక రేంజిలో ప్రచారం కూడా సాగింది. ఇంకేముంది నాగబాబు కాబోయే సెంట్రల్ మినిస్టర్ అని పొలిటికల్ హడావుడి కూడా పీక్స్ లో సాగింది.
సీన్ కట్ చేస్తే నాగబాబు అనకాపల్లికి బహు దూరం అని తేలింది. ఎంపీగా పోటీ చేయడం కోసం ఆయన అచ్యుతాపురంలో తీసుకున్న అద్దె ఇల్లు కూడా వారానికే మూత పడిపోయింది. ఇపుడు చూస్తే నాగబాబు కేరాఫ్ హైదారాబాద్ అన్నట్లుగా కధ ఉంది.
మరి నాగబాబు చడీ చప్పుడూ లేదు. ఇంతకీ ఆయన ఏమి చేస్తున్నట్లు అంటే నాగబాబు ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు అని అంటున్నారు. ఆయనకు పోటీ చేయడానికి ఎంపీ సీటు అయితే లేదు అని అంటున్నారు. పైగా బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చిన మూడు ఎంపీ సీట్లలో కూడా ఒకటి లాగేసుకుంటున్న వేళ నాగబాబు ఇక ఎంపీకి పోటీ అన్న మాటే లేదు అని అంటున్నారు.
దాంతో మెగా బ్రదర్ మౌన రాగాలు ఆలపిస్తున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే నాగబాబుకు టికెట్ కూడా లేదు అంటే అది పవన్ కళ్యాణ్ కే కొంత ఇబ్బంది అని అంటున్నారు. సొంత అన్నదమ్ముడికే టికెట్ లేకుండా పోతే ఎలా అన్న చర్చ కూడా నడుస్తోంది. దాంతో అన్నకు ఎలాగైనా అసెంబ్లీ టికెట్ అయినా అడ్జస్ట్ చేయకపోతారా అన్న కొత్త చర్చకు కూడా తెర లేచింది. పవన్ కనుక నో అంటే తిరుపతి సీటు నాగబాబుకు ఉందని అంటున్నారు.
అయితే బీజేపీ చేరికతో చాలా ఎత్తులు వ్యూహాలు ఉన్నాయి. దీంతో జనసేన అసెంబ్లీ సీట్లలో కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. దీంతో అన్నీ చూసుకున్న మీదటనే జనసేన అభ్యర్ధుల జాబితా రిలీజ్ కావచ్చు. ఒకవేళ అపుడు అసెంబ్లీకి పోటీ చేసే లిస్ట్ లో నాగబాబు పేరు ఉంటే ఉండొచ్చు. లేకపోతే మాత్రం ఆయన ఈసారికి సారీ చెప్పి ఎన్నికలలో పోటీ నుంచి పక్కకు వైదొలగడమే మిగిలింది అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే నాగబాబు మౌన వ్రతం వెనక ఏమి ఉంది అన్న చర్చ కూడా సాగుతోంది. టీడీపీ అతి తక్కువ సీట్లు విదిలించడం, ఆ ఇచ్చిన వాటిలో కొన్ని వెనక్కి తీసుకోవడం ఇవన్ని మెగా బ్రదర్ లో అసహనానికి కారణం అవుతున్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది.
ఏది ఏమైనా కూడా నాగబాబు మాత్రం ఎన్నికల హడావుడికి ముందే దూరంగా ఉన్నారు అని అంటున్నారు. ఇక ఆయన అనకాపల్లి వచ్చి చేసిన హడావుడి వల్ల మాత్రం మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణకు కలసి వచ్చింది. ఎంపీగా నాగబాబు అని ఫిక్స్ అయిన వేళ పట్టుబట్టి కొణతాలకు అసెంబ్లీ టికెట్ ఇపించారు మెగా బ్రదర్స్. ఇపుడు నాగబాబు సీటు చిరిగిపోయింది. కొణతాల సీటు మాత్రం ఫిక్స్ అయిపోయింది. దాంతో ఈ పితలాటమంతా జనసేన హడావుడి వల్లనే వచ్చిందని అనకాపల్లి తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొణతాలకు టికెట్ ఇచ్చి పోటీ చేయించేవరకూ డౌటే అని కూడా మరో మాట వినిపించడం విశేషం.