Begin typing your search above and press return to search.

నాగబాబు తిరుపతి నుంచా...!?

నాగబాబుని ఏకంగా తిరుపతి అసెంబ్లీ నుంచి పోటీ చేయిస్తారు అని అంటున్నారు. తిరుపతి రాయలసీమ జోన్ లో ఉంది. పవన్ కళ్యాణ్ నే తిరుపతి నుంచి పోటీ చేయమని కోరుతున్నారు.

By:  Tupaki Desk   |   2 Feb 2024 1:26 PM GMT
నాగబాబు తిరుపతి నుంచా...!?
X

జనసేన కీలక నేత మెగా బ్రదర్ నాగబాబు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది చర్చకు వస్తోంది. ఎందుకంటే నాగబాబు 2019లో కూడా జనసేన నుంచి పోటీ చేశారు. ఆయన నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి లక్షలలోనే ఓట్లు సంపాదించారు. జనసేనలో పవన్ నాదెండ్ల తరువాత కీలక నేతగా నాగబాబు ఉన్నారు.

ప్రస్తుతం ఆయన బలమైన కాపు సామాజిక వర్గాన్ని జనసేన వైపుగా ఆకర్షించేందుకు జిల్లా పర్యటనలు చేస్తున్నారు. నాగబాబు సేవలను పార్టీ కోసమే కాకుండా ప్రత్యక్ష ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని పవన్ ఆలోచిస్తున్నారు. ఈసారి ఆయనని ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీకి పెట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు.

ఎంపీగా నాగబాబు పోటీ చేయాలంటే 2019 నాటి నర్సాపురం సీటు అయితే ఖాళీగా లేదు అని అంటున్నారు. పొత్తులలో భాగంగా ఈ సీటుని జనసేనకు ఇస్తారని అనుకున్నా ఇక్కడ నుంచి వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామ క్రిష్ణం రాజు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అని తెలుస్తోంది. రఘురామ ఈ సీటు మీద మొదటి నుంచి దృష్టి పెట్టి టీడీపీ జనసేనలతో టచ్ లో ఉంటూ వస్తున్నారు.

ఆయనకు ఈ ఎంపీ సీటుని చంద్రబాబు కన్ ఫర్మ్ చేశారు అని మాట అయితే వినబడుతోంది. దాంతో నాగబాబు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న ప్రశ్నలు ఉన్నాయి. ఆయనకు కాకినాడ ఎంపీ సీటు ఇస్తారని ఒక ప్రచారం సాగినా ఇపుడు మరో రకమైన ప్రచారం సాగుతోంది.

నాగబాబుని ఏకంగా తిరుపతి అసెంబ్లీ నుంచి పోటీ చేయిస్తారు అని అంటున్నారు. తిరుపతి రాయలసీమ జోన్ లో ఉంది. పవన్ కళ్యాణ్ నే తిరుపతి నుంచి పోటీ చేయమని కోరుతున్నారు. అయితే ఆయన కోస్తా మీదనే ఫోకస్ పెట్టారు. అందునా ఉభయ గోదావరి జిల్లాలలో తాను పోటీ చేస్తే ఆ ప్రభావం జనసేన మీద గట్టిగా పడి ఎక్కువ సీట్లు గెలుచుకునే చాన్స్ ఉందని భావిస్తున్నారు.

దాంతో జనసేన తరఫున రాయలసీమ రీజియన్ నుంచి కుటుంబ సభ్యుడు అయిన నాగబాబుని పోటీకి దింపితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారుట. అదే కనుక జరిగితే రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల పైన ఆ ప్రభావం పడి జనసేనకు పాజిటివ్ అవుతుందని అంటున్నారు. నాగబాబు అయితే ఎన్నికల్లో ఈసారి పోటీ చేయను పార్టీ కోసమే అని చెబుతూ వచ్చారు.

కానీ ఒకసారి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటే మాత్రం దాన్ని నాగబాబు తప్పకుండా ఓకే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పైగా తిరుపతి సీటు అంటే మెగా ఫ్యామిలీ నుంచే ఎవరో ఒకరికి అని అంటున్నారు గతంలో ఇదే సీటు నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. చిరంజీవి అలా రాయలసీమ ప్రతినిధిగా కొన్నాళ్ల పాటు ప్రజారజ్యం తరఫున పనిచేశారు.

ఇపుడు అదే సీటు నుంచి మెగా బ్రదర్ నాగబాబుని పోటీకి నిలిపితే కచ్చితంగా విజయావకాశాలు ఉంటాయని అంటున్నారు. పైగా రాయలసీమ రీజియన్ లో వైసీపీ బలంగా ఉంది. దాంతో నాగబాబు పోటీ ద్వారా దాన్ని బ్రేక్ చెయవచ్చు అన్న లెక్కలు కూడా ఉన్నయని అంటున్నారు.

ఇక్కడ ప్రధాన సామాజిక వర్గం బలిజలు కూడా జనసేన వైపు పూర్తి స్థాయిలో ఆకర్షితులు కావడానికి వీలు ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా చూస్తే కనుక నాగబాబు ఈసారి తన రాజకీయ జాతకాన్ని తిరుపతి నుంచి పరీక్షించుకుంటారు అని అంటున్నారు. ఈసారి పవన్ నాగబాబు ఇద్దరూ అసెంబ్లీకి పోటీ చేసి చట్ట సభలలో ప్రత్యక్షం అవుతారా అన్నది హాట్ హాట్ పాయింట్.