జగన్ కు నాగబాబు గట్టి కౌంటర్!
కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే విమర్శలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న జగన్ డిమాండ్ పై నాగబాబు మండిపడ్డారు.
By: Tupaki Desk | 20 July 2024 8:35 AM GMTఏపీలో పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్య వ్యవహారం సెగలు రేపుతోంది. ఈ హత్యను గట్టిగా ఖండించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 35 మంది వైసీపీ కార్యకర్తలను చంపారని ఆరోపించారు. హత్యాయత్నాలు, ఇళ్లు, విగ్రహాలు కూల్చడం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో జగన్ పై జనసేన పార్టీ ముఖ్య నేత నాగబాబు మండిపడ్డారు. వినుకొండలో రషీద్ హత్య వ్యవహారంలో జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే విమర్శలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న జగన్ డిమాండ్ పై నాగబాబు మండిపడ్డారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని దుర్మార్గ పాలన జగన్ హయాంలోనే చూశామని గుర్తు చేశారు.
జగన్ ను అధికారంలోకి తీసుకురాకుండా ప్రజలు తమను తాము కాపాడుకున్నారని తెలిపారు. శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా ఉండేందుకే ధర్నా పేరుతో ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపించారు. జగన్ శవ రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా జగన్ బుద్ధి మార్చుకోవడం లేదని ఫైరయ్యారు.
జగన్ పాలనలో సామాన్య ప్రజలు నోరెత్తాలంటే భయపడి పోయారని నాగబాబు గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన నీతులు వల్లించడం అసలు బాలేదన్నారు. వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవతో జరిగిన హత్యను రాజకీయంగా వాడుకోవడానికి శోచనీయమన్నారు.
వినుకొండలో రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదని నాగబాబు స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో అతను హత్యకు గురయ్యాడని చెప్పారు. తాము ఈ హత్యను సమర్థించడం లేదని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామని తెలిపారు.
గత జగన్ పాలనలో ఎన్నో దారుణాలకు పాల్పడ్డారని నాగబాబు గుర్తు చేశారు. అమాయకులను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తేనే భౌతిక దాడులు చేసి కొట్టారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్ష నేతలపై కేసులు కూడా పెట్టారని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిపారేశారన్నారు. ఐపీఎస్‌లను వైసీపీ నాయకులుగా మార్చి పని చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై పెట్టిన కేసులకు హద్దే లేదని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దందాలకు అమాయకులైన అధికారులు బలయ్యారన్నారు.