Begin typing your search above and press return to search.

ఓట్ల బదిలీ బాధ్యత నాగబాబుదే...?

ఇవన్నీ ఒక ఎత్తు అయితే జనసేన నుంచి టీడీపీకి ఓట్ల బదలాయింపు సవ్యంగా సాగేలా చూసే బాధ్యతను ఆయన నాగబాబుకు అప్పగించారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   3 Oct 2023 3:45 AM GMT
ఓట్ల బదిలీ బాధ్యత నాగబాబుదే...?
X

పవన్ కళ్యాణ్ వారాహి నాలుగవ విడత యాత్ర సందర్భంగా గత రెండు రోజులుగా ఆయన స్పీచ్ కానీ క్యాడర్ కి ఆయన దిశా నిర్దేశం చేస్తున్న తీరు కానీ చూస్తే టీడీపీ జనసేన ఒక్కటిగా ఉండాలని, పాత గొడవలు ఏవైనా ఉంటే మరచిపోవాలని అంటున్నారు. తాను విశాల దృక్పధంతో అన్నీ ఆలోచిస్తానని, పార్టీ లో వారు కూడా అలాగే చేయాలని ఆయన కోరుతున్నారు.

అధికారం అన్నది అంచెలంచెలుగా వస్తుందని, ముందు స్టేట్ ఫస్ట్ అన్నది చూడాలని కోరుతున్నారు. పవన్ ఇంతలా మాట్లాడుతున్న దాని వెనక నేపధ్యం ఏంటి అంటే జనసేనకు టీడీపీతో పొత్తు ఇష్టమా కాదా అన్నది పక్కన పెడితే పవన్ సీఎం అవుతారా లేదా అన్న అతి పెద్ద డౌట్ వల్లనే.

పవన్ అయితే తనకు పదవుల మీద మోజు లేదని అంటున్నారు. ఆయన అలా అన్న సందర్భంలో కూడా క్యాడర్ నుంచి సీఎం అన్న స్లోగన్స్ వస్తున్నాయి. పవన్ చిరు నవ్వుతోనే వాటిని పక్కన పెడుతూ ఆలోచించాలి మీరు అంటూ వారికి చెప్పుకొస్తున్నారు. మనలో మనకు తగవులు వస్తే మళ్ళీ ముప్పే అని హెచ్చరిస్తున్నారు.

ఇక పవన్ మరో మాట అన్నారు. మనకు బలమైన సీట్లనే పొత్తులో గెలుచుకుందామని. అలాగే గెలిచిన తరువాతనే రాజు ఎవరో మంత్రి ఎవరో అంటున్నారు. అంతే తప్ప క్లారిటీగా సీఎం పోస్ట్ షేర్ చేసుకుందామని చెప్పడంలేదు. ఇక్కడే క్యాడర్ లో అసంతృప్తి ఉందని అంటున్నారు. ఈ విషయాలు అన్నీ పవన్ కి తెలియనివి కావు. అందుకే ఆయన పార్టీ జనాలను సముదాయిస్తూ కన్విన్స్ చేస్తూ కొన్ని సందర్భాలలో హెచ్చరిస్తూ ప్రసంగాలు చేసుకుంటూ వస్తున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే జనసేన నుంచి టీడీపీకి ఓట్ల బదలాయింపు సవ్యంగా సాగేలా చూసే బాధ్యతను ఆయన నాగబాబుకు అప్పగించారు అని అంటున్నారు. అందుకే రాజకీయ తెర మీద ఇటీవల మెరిసిన నాగబాబు తిరుపతిలో కనిపించారు రెండు పార్టీల మధ్య సఖ్యత అవసరం అన్నారు. టీడీపీని ఎవరూ ఏమీ అనకూడదు అంటున్నారు.

పార్టీకి ఈ విధంగా గైడ్ చేస్తూ వారిని సరైన డైరెక్షన్లో పెట్టే బాధ్యతలు ఇపుడు నాగబాబు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఓకే అనుకున్నా కూడా పవన్ సీఎం ఈ రెండు మాటల నుంచి క్యాడర్ ని దూరంగా జరగమని ఎవరైనా అన్నా వారు అసలు ఒప్పుకునే పరిస్థితి ఉండదని అంటున్నారు. అది పవన్ కళ్ళ ముందే జరుగుతోంది. ఆయన ఎక్కడ మాట్లాడినా పవన్ సీఎం అనే అంటున్నారు.

ఇక జనసేనలో జరుగుతున్న ప్రచారం కానీ కాపులలో ఉన్న మాట కానీ చూస్తే కచ్చితంగా యాభై నుంచి అరవై అసెంబ్లీ సీట్లు పొత్తులో భాగంగా టీడీపీ నుంచి తీసుకోవాలని, అలాగే ఏడు దాకా ఎంపీ సీట్లు తీసుకోవాలని, పవన్ కి సీఎం పదవి కొంతకాలం ఇచ్చేలా ఒప్పదం ఉండాలన్నదే సగటు జనసేన కార్యకర్త కోరిక అంటున్నారు. కాపు సామాజికవర్గంలో కూడా అదే కోరికగా ఉంది అని అంటున్నారు.

మరి ఇంతలా బలంగా ఉన్న కోరిక నేపధ్యంలో సీఎం ఎవరో ఎన్నికల తరువాత చూసుకుందామని పవన్ అంటే కుదురుతుందా అన్నది ఒక మాటగా ఉంది. అదే విధంగా ఎవరికి ఎన్ని సీట్లు ఎంత మంది గెలిచారు అన్న గెలుపు నిష్పత్తిని బట్టి సీఎం పదవి గురించి ఆలోచిద్దామని చెప్పినా ఎన్నికల ముందు ఎలాగూ జనసేన సీట్లు తెలుస్తాయి.

మరి ఆ తరువాతనే కదా ఓట్ల బదిలీ అన్నది ఉండేది. ఈ విషయంలో నాగబాబు రంగంలోకి దిగినా అది ఆయనకు బిగ్ టాస్క్ గా ఉంటుందని అంటున్నారు. మరి పొత్తు వల్ల టీడీపీ లో ఎలాంటి చర్చ జరుగుతోంది అన్నది ఇప్పటి దాకా తేలలేదు. ఆ పార్టీ వైపు నుంచి ఓట్ల బదిలీ అన్నది మరో ఎత్తు. ఏది ఏమైనా పాలిటిక్స్ లో వన్ ప్లస్ వన్ టూ అవుతాయా అంటే వెయిట్ అండ్ సీ.