Begin typing your search above and press return to search.

పక్కా లోకల్ అంటున్న నాగబాబు...ఎంపీ కోసమేనా...!?

ఇపుడు అదే అనకాపల్లి నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేయాలని మెగా బ్రదర్ నాగబాబు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Feb 2024 12:02 PM GMT
పక్కా లోకల్ అంటున్న నాగబాబు...ఎంపీ కోసమేనా...!?
X

రాజకీయాలు అంటే అన్నీ వచ్చేస్తాయి. కులం మతం ప్రాంతం ఇలా అనేక సమీకరణలతో గెలుపోటములు ప్రభావితం అవుతున్న కాలం నడుస్తోంది. కేవలం నాన్ లోకల్ అన్న ప్రచారంతోనే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 2009 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటులో పోటీ చేసి ఓటమి చవి చూశారు.ఇపుడు అదే అనకాపల్లి నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేయాలని మెగా బ్రదర్ నాగబాబు చూస్తున్నారు.

తన అన్నను ఢిల్లీని పంపించి తాను ఏపీ అసెంబ్లీలో కాలు పెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. అయిదేళ్ళ క్రితం కూడా నర్సాపురం ఎంపీ సీటు నుంచి నాగబాబుని పోటీ చేయించారు. అయితే నర్సాపురం నాగబాబు సొంత ప్రాంతంగా ఉండడంతో లోకల్ కార్డు ఇష్యూ రాలేదు ఇపుడు అదే నాగబాబు అనకాపల్లికి షిఫ్ట్ అవుతున్నారు.

అనకాపల్లి అంటే పక్కా లోకల్ కే చోటు ఇస్తారు. ఇక్కడ ఎక్కువగా బలమైన సామాజిక వర్గానికే చెందిన వారు గెలుస్తారు. విశాఖ ఎంపీ సీటు చూసుకుంటే గత నాలుగు దశాబ్దాలుగా నాన్ లోకల్స్ పరం అయిపోయింది. విశాఖ కాస్మోపాలిటన్ సిటీ కావడం వల్ల ఇబ్బంది లేదు. కానీ అనకాపల్లి మాత్రం స్థానికులకే పెద్ద పీట వేస్తుంది. ఎవరి గెలిచినా ఓడినా లోకల్ అయి ఉండాలని అంటున్నారు.

అంత దాకా ఎందుకు విశాఖ నుంచి అనకాపల్లికి వచ్చి పోటీ చేసినా ఒప్పుకోని నైజం అనకాపల్లి ప్రజలది. అలాంటి సీటులో నాగబాబు పోటీకి దిగుతున్నారు అని ప్రచారంలో ఉంది. తన పోటీ విషయంలో సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తున్న నాగబాబు దాని కంటే ముందు పనులలో ఉన్నారు. తాను ఇక మీదట ఎలమంచిలిలో నివాసం ఉంటాను అని నాగబాబు ఒక సంచలన ప్రకటన చేశారు.

ఆయన హైదరాబాద్ నుంచి విశాఖ వస్తూ ఎయిర్ పోర్టులో మీడియాతో ఈ మాటలు అన్నారని అంటున్నారు. ఎక్కడి నాగబాబు ఎక్కడి ఎలమంచిలి అన్న చర్చ సాగుతోంది. ఆయన హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి నాగబాబు ఎలమంచిలిలో ఉండడం ఏమిటి అంటే ఎంపీ సీటు కోసమే అని అంటున్నారు. అయితే నాగబాబు మాత్రం తన పోటీ విషయం అధినాయకత్వం నిర్ణయిస్తుంది అని అంటున్నారు.

తాను మాత్రం ఏపీలో జనసేన కార్యక్రమాల్లో పాలుపంచుకునే క్రమంలో ఎలమంచిలి కేంద్రంగా పనిచేస్తాను అని అంటున్నారు. మొత్తానికి నాగబాబు హైదరాబాద్ నుంచి ఎలమంచిలికి మకాం మారుస్తున్నారు అన్న మాట. మరి ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు తాను లోకల్ అని చెప్పుకునేందుకు ఇలా చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.

ఎలమంచిలిలో ఉన్నా అనకాపల్లి ఎంపీ సీటు గెలిచాక నాగబాబు తిరిగి హైదరాబాద్ అనకాపల్లి వయా ఎలమంచిలి అన్నట్లుగా టూర్లు వేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా అనకాపల్లిలో కాపులు ఎక్కువగా ఉన్నారు. గతంలో కాపుల నుంచి గుడివాడ గురునాధరావు, అవంతి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు ఎంపీలుగా ఎన్నిక అయ్యారు వీరిలో గుడివాడ పక్కా లోకల్. మిగిలిన ఇద్దరూ విశాఖలో స్థిరపడిన వారు కావడంతో జనాలు ఓకే అనేశారు.

ఇపుడు నాగబాబు కూడా తన శాశ్వత నివాసం ఎలమంచిలిని చేసుకుంటారా లేక ఎన్నికల తరువాత ఫలితాలు తేడా కొడితే హైదరాబాద్ అంటారా అన్న ప్రశ్నలు ఉన్నాయి. కులం, ప్రాంతం రెండూ బలమైన అంశాలే. నాగబాబుకు కులం కార్డు నూరు పాళ్ళు కలసివస్తుంది అని అంటున్నారు. నాన్ లోకల్ అన్న మైనస్ పాయింట్ ని ఎలమంచిలి నివాసం ఎంతవరకూ కాపాడుతుందో చూడాలి. ఏది ఏమైనా వైసీపీ ఇదే అంశాన్ని జనం ముందు పెట్టడానికి రెడీగా ఉంటుందని అంటున్నారు